ఈ మధ్యకాలంలో తమ సినిమాపై ఓవర్ కాన్ఫిడెన్స్ చూపడం, వివాదాస్పద వ్యాఖ్యలను చేయడం, సినిమాలో ఉన్న లిప్‌లాక్ సీన్, హీరో విజయ్‌దేవరకొండ యాటిట్యూడ్ వల్ల తాజాగా విడుదలైన 'అర్జున్‌రెడ్డి' చిత్రానికి బాగానే హైప్ వచ్చింది. హీరో స్టామినాకి మించి ఓపెనింగ్స్‌ని రాబట్టుకుంటోంది. ఇక ఈ చిత్రం ప్రీరిలీజ్ వేడుకలో విజయ్ చేసిన వ్యాఖ్యలు, సినిమాలోని కిస్, బూత్ కంటెంట్, బూతు పదాలు ఓ రేంజ్‌లో ట్రెండ్ అవుతున్నాయి. ఇక ఈ చిత్రం హీరో ఎంత మాట్లాడినా దర్శకుడు మాత్రం ఎక్కువగా మాట్లాడాల్సింది కాదు.. ఆయన సినిమా ద్వారా తన గురించి అందరూ మాట్లాడేలా చేసుకోవాలి. కానీ దానికి బదులుగా ఆయన 'అర్జున్‌రెడ్డి' ఓడ్రగ్ లాంటిదని, దానికి వ్యసనమై పోతారని ఏవేవో మాట్లాడారు.
తాజాగా ఆయన మాట్లాడుతూ, ఈ సినిమాను చేయగల సరైన హీరో అల్లుఅర్జునేనని స్టేట్‌మెంట్ ఇచ్చాడు. తాను ఆరేళ్ల కిందటే బన్నీకి ఓ కథ చెప్పానని, కానీ అది వర్కౌట్ కాలేదని, కానీ ఈ చిత్రం సబ్జెక్ట్, తాను బన్నీకి చెప్పిన సబ్జెక్ట్ ఒకటి కాదని చెప్పాడు. ఇక 'అర్జున్‌రెడ్డి' కథను బన్నీని చేయమని అడగలేదని, కానీ కథను ఆయనకు చెప్పాలని భావించానన్నాడు. కానీ ఆరేళ్ల ముందు బన్నీ వేరని, ఇప్పుడు బన్నీ స్టైలిష్‌స్టార్‌గా ఎంతో ఎదిగాడని చెబుతున్నాడు. 'అర్జున్‌రెడ్డి' చిత్రాన్ని విజయ్ దేవరకొండ చేయకపోతే ఈ అవుట్‌పుట్ వచ్చేది కాదంటున్నాడు.
ఇక తన తొలి చిత్రం విడుదల కాకుండానే తనకు పెద్ద హీరోల నుంచి తెగ ఫోన్ కాల్స్ వస్తున్నాయట. 'పెళ్లి చూపులు' సమయంలో దర్శకుడు తరుణ్‌భాస్కర్ కూడా ఇలాగే చెప్పాడు. తాను వెంకటేష్‌తో సినిమా చేయబోతున్నానని చెప్పాడు. చివరకి ఎవ్వరూ ఆయనతో సినిమాలు చేయడానికి అంగీకారం తెలపకపోయే సరికి, ఆయన ప్రస్తుతం నిఖిల్‌ని ఒప్పించే పనిలో ఉన్నాడట. తరుణ్‌భాస్కర్ లాగానే సందీప్ రెడ్డి వంగా కూడా అదే ధోరణిలో మాట్లాడుతున్నాడు. 'అర్జున్‌రెడ్డి' విడుదలై, టాక్ కూడా బాగానే వుంది. మరి ఇప్పుడు డైరెక్టర్ సందీప్ రెడ్డిని అస్సలు పట్టుకోలేరేమో..!