తెలుగులో వైవిధ్యభరితమైన చిత్రాలను తీసే దర్శకుల కొరత ఉందనేది వాస్తవం. అలా తీయగలిగిన గట్స్ ఉన్నా మన నిర్మాతలు, ప్రేక్షకులు వారిని సరిగా ఉపయోగించుకోకపోతున్నారు. నాటి నరసింగరావు, ఉమామహేశ్వరరావు, గీతాకృష్ణ వంటి వారితో పాటు క్రిష్, చంద్రశేఖర్ యేలేటి, హను రాఘవపూడిలు కూడా ఇదే కోవలోకి వస్తారు. ఇలాంటి వైవిధ్యభరితమైన చిత్రాలకు బాలీవుడ్, కోలీవుడ్, శాండల్‌వుడ్, మాలీవుడ్ వంటి చోట్ల మంచి ఆదరణ ఉంటుంది. కానీ అది తెలుగులో ఎప్పుడో ఒకసారి మాత్రమే ప్రేక్షకులను ఆలరిస్తాయి.
ఇక 'గౌతమీపుత్ర శాతకర్ణి'లో క్రిష్ కూడా కమర్షియల్ దర్శకునిగా అవతరించాడు. ఇక చంద్రశేఖర్ యేలేటి విషయానికి వస్తే ఆయన తన తొలి చిత్రం 'ఐతే' ద్వారా సంచలనం సృష్టించాడు. చిన్న, ప్రయోగాత్మక చిత్రాలకు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచాడు. తర్వాత కూడా తన రూట్‌లోనే 'అనుకోకుండా ఒకరోజు, సాహసం, ప్రయాణం, ఒక్కడున్నాడు. మనమంతా' చిత్రాలతో తన సత్తా చాటాడు. ఇక ఇటీవల వచ్చిన 'మనమంతా' చిత్రం అద్భుతంగా ఉన్నా కమర్షియల్‌గా నిర్మాత సాయి కొర్రపాటికి భారీ నష్టాలను మిగిల్చింది. ఇక ఈయన శిష్యుడిని చూసినా కూడా ఆయన కూడా తన గురువు దారిలోనే నడుస్తున్నాడు. ఇంతకీ ఆ శిష్యుడు ఎవరనుకున్నారు..? హను రాఘవపూడి.
ఈయన దర్శకత్వం వహించిన 'అందాల రాక్షసి' చిత్రం మంచి పేరు తెచ్చుకున్నా హిట్ కాలేదు. కానీ తర్వాత ఆయన నానితో చేసిన 'కృష్ణగాడి వీరప్రేమగాథ' చిత్రం బాగానే ఆడింది. ఇక ఎంతో ప్రయోగాత్మకంగా, భారీ బడ్జెట్‌తో 14రీల్స్ పతాకంపై నితిన్ హీరోగా నటించిన 'లై' చిత్రం కూడా భారీ నష్టాలనే మిగులుస్తోంది. సినిమా ఎంతో వైవిధ్యభరితమైన చిత్రంగా ప్రశంసలు అందుకున్నా సినిమా కమర్షియల్‌గా నష్టాలను తెచ్చింది. మరి ఈ గురు శిష్యులు తెలుగును వదిలేసి మరో భాషను ఎంచుకుంటేనే గానీ వీరి దశ తిరిగేట్లు లేదు.