ఎన్టీఆర్ త్రిపాత్రాభినయం చేస్తున్న 'జై లవ కుశ' చిత్రం రిలీజ్‌కి పెద్దగా టైం లేదు. ఇందులో ఎన్టీఆర్ నెగటివ్ టచ్ ఇస్తూ చేస్తున్న 'జై' పోస్టర్స్, టీజర్ అదిరిపోయింది. ఇక తాజాగా విడుదలైన 'లవకుమార్' పాత్రలో ఎన్టీఆర్ బ్యాంకు మేనేజర్‌గా తన పాత్రను పరిచయం చేస్తున్నాడు. మరీ మంచితనం మూర్తీభవించిన అమాయకమైన పాత్రతో ఈ పాత్ర రూపొందింది అనిపిస్తోంది, ఎన్టీఆర్-బ్రహ్మాజీల పాత్రల మద్య వచ్చే సీన్ కూడా కృత్రిమంగా ఉంది. ఇది మరీ రాముడు మంచి బాలుడు తరహాలో కనిపిస్తూ ఉండటంతో ఎన్టీఆర్ కొత్తగా ట్రై చేశాడు అనే గానీ, అంత పెద్దగా కిక్ అయితే ఇవ్వలేదు. మంచితనం.. ఇది పుస్తకాలలో ఉంటే పాఠం అవుతుంది. జీవితంలో ఉంటే గుణపాఠం అవుతుంది...అనే డైలాగ్ ఓకే అనిపించింది. ఇక ఈ టీజర్ వచ్చిందో లేదో..వెంటనే 'కుశ' పాత్రను కూడా రిలీజ్ చేసింది యూనిట్. రిలీజ్ కి టైమ్ దగ్గర పడుతుంది చిత్ర యూనిట్ స్పీడ్ పెంచింది.
ఇక 'కుశ' లుక్ లో ఎన్టీఆర్‌ని యంగ్ అండ్ ఎనర్జిటిక్‌గా చూపించారు. పొడుగు జుట్టుతో ఎన్టీఆర్ విభిన్నంగా కనిపిస్తున్నాడు. ఈ పాత్రలో పక్కా మాస్ అప్పీల్ ఉంది. ఈ లుక్‌ని చూస్తుంటే ఎన్టీఆర్ నటించిన 'శక్తి' చిత్రంలోని గెటప్ గుర్తుకొస్తోందనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. మరికొందరు మాత్రం దమ్ము సినిమాలో రూలర్ సాంగ్ లో ఎన్టీఆర్ లా వున్నాడని అనుకుంటున్నారు. ఇక ఈ చిత్రం మొత్తం మీద దర్శకుడు బాబి, హీరో ఎన్టీఆర్, నిర్మాత నందమూరి కళ్యాణ్‌రామ్‌లు 'జై' పాత్రపై పెట్టిన దృష్టి మిగిలిన క్యారెక్టర్ల మీద పెట్టలేదని, 'జై'ని పీక్స్‌లో చూపించడం కోసం మిగిలిన లవకుమార్, కుశ పాత్రలను కాస్త తక్కువ ప్రోఫైల్ మేనేజ్ చేసినట్లుగా కనిపిస్తోందని అంటున్నారు.