శ్రీ వేంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ లో దిల్ రాజు ఈ ఏడాది హిట్స్ మీద హిట్స్ కొడుతున్నాడు. మొదటిగా ఫ్యామిలీ ఎంటర్టైనర్ తో హిట్స్ కొట్టడం మొదలెట్టిన దిల్ రాజు నిన్నమొన్నటి 'ఫిదా' వరకు హిట్స్ విషయంలో వెనక్కి తిరిగి చూసుకోలేదు. మరి ఈ సక్సెస్ ఫుల్ నిర్మాత ఎప్పుడూ కూడా కుటుంబ కథా చిత్రాలకే ఇంపార్టెన్స్ ఇస్తాడు కాబట్టే ఇంతలా సక్సెస్ సాధించగలుగుతున్నాడు. అందుకే ఈసారి కూడా 'శతమానంభవతి' వంటి ఫ్యామిలీ స్టోరీ ని తెరకెక్కించడానికి ప్లాన్ చేస్తున్నాడు. ఆ చిత్రానికి ఎంతో అందమైన టైటిల్ 'శ్రీనివాస కళ్యాణం' అంటూ రిజిస్టర్ కూడా చేయించాడు.
మరి 'శతమానంభవతి' డైరెక్టర్ శతీష్ వేగేశ్న మంచి కథతో... దిల్ రాజు నిర్మాతగా 'శ్రీనివాస కళ్యాణం' తెరకెక్కించడానికి రెడీగా వున్నాడు.... కానీ హీరో మాత్రం దొరకడంలేదు. నిర్మాత దిల్ రాజు కి మాత్రం శ్రీనివాస కల్యాణంలో చేసే హీరో ఎవరనే వాళ్లలో ముగ్గురు మనసులో ఉన్నారట. వారెవరంటే 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు' చిత్రంతో హిట్ కొట్టిన మహేష్ బాబుతో ఈ సినిమా చెయ్యాలని.. దిల్ రాజు మహేష్ ని సంప్రదించగా మహేష్ మాత్రం 'సీతమ్మ.., బ్రహ్మ్మోత్సవం' చిత్రాల తర్వాత మళ్ళీ ఇప్పట్లో కుటుంబకథా చిత్రం చేయాలని లేదని.... స్మూత్ గా తిరస్కరించాడట.
ఇక దిల్ రాజు మదిలో ఉన్న మరో హీరో ఎన్టీఆర్. ఇక దిల్ రాజు, ఎన్టీఆర్ ని సంప్రదించేలోపే ఎన్టీఆర్ త్రివిక్రమ్, కొరటాల సినిమాల కమిట్మెంట్స్ తో బిజీగా ఉండడంతో దిల్ రాజుతో ఈ ప్రాజెక్ట్ చెయ్యడానికి ఇప్పుడు ఎన్టీఆర్ రెడీగా లేకపోవడంతో.. చేసేది లేక దిల్ రాజు ఈ ప్రాజెక్ట్ ని మరో స్టార్ హీరో రామ్ చరణ్ తో చెయ్యాలని భావిస్తున్నాడట. ఎట్టి పరిస్థితుల్లో చరణ్ ని ఒప్పించి ఈ చిత్రాన్ని తెరకెక్కించాలనే ప్రయత్నంలో దిల్ రాజు నిమగ్నమైనట్లు చెబుతున్నారు.
మరి రామ్ చరణ్ ఒక పక్క 'రంగస్థలం' తో బిజీగా ఉండడం, తన తండ్రి 'సై రా నరసింహ రెడ్డి' నిర్మాణ బాధ్యతలు నెత్తినేసుకోవడమే కాక తన నెక్స్ట్ ప్రాజెక్ట్ కొరటాల డైరెక్షన్ లో ఉంటుందని అధికారిక అనౌన్సమెంట్ ఇచ్చాడు. మరి దిల్ రాజుతో 'శ్రీనివాస కళ్యాణం' చేసే హీరో ఎవరనేది ప్రస్తుతానికి క్లారిటీ వచ్చేలా లేదు.