వయసు 35ఏళ్లు దాటినా తమిళంలో స్టార్ హీరోయిన్ల నుంచి కొత్తగా పరిచయం అవుతున్న హీరోల వరకు నయనతారనే కోరుకుంటున్నారు. అమ్మడు భారీ పారితోషికం అడిగినా, ప్రమోషన్లకు రాకపోయిన, ఇతర కండీషన్స్ ఎన్ని ఉన్నా ఒప్పుకుని ఆమె తమ చిత్రంలో నటిస్తే అది హిట్టవుతుందని, తొలివారం ఓపెనింగ్స్‌ని సాధించేలా చేయడంలో ఆమె పాత్ర ఎంతో కీలకమని భావిస్తున్నారు.
ఇక ఆమె లేడీ ఓరియంటెడ్ పాత్రలో కూడా పలు చిత్రాలు వస్తున్నాయి. కానీ ఆమె తెలుగులో మాత్రం కేవలం సీనియర్ స్టార్స్‌కే పరిమితమవుతోంది. నాగార్జునతో 'గ్రీకువీరుడు', విక్టరీ వెంకటేష్‌తో నటించిన 'బాబు బంగారం' చిత్రాలు పెద్ద హిట్ కాకపోయినప్పటికీ తెలుగు లో కూడా ఆమె క్రేజ్ తగ్గలేదు. తాజాగా ఇప్పటికే బాలయ్యతో 'శ్రీరామరాజ్యం, సింహా'ల తర్వాత తమిళ దర్శకుడు కె.యస్.రవికుమార్ దర్శకత్వంలో సి.కళ్యాణ్ నిర్మాతగా రూపొందనున్న 102వ చిత్రంలో హీరోయిన్‌గా ఎంపికైంది. దీని కోసం ఆమె 3కోట్లు తీసుకుందిట.
ఇక అదే సమయంలో మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న 151వ చిత్రం 'సై...రా.. నరసింహారెడ్డి' చిత్రంలో కూడా ఆమె నటించనున్నట్లు అఫీషియల్‌గా అనౌన్స్ చేశారు. ఈ సినిమా కోసం ఆమె ఎక్కువ డేట్స్ కేటాయించాల్సి ఉండటంతో ఇందుకు గాను ఈ చిత్రం కోసం నయనతార ఏకంగా 4కోట్లు డిమాండ్ చేసి సాధించుకున్నదని వార్తలు వస్తున్నాయి. ఇదే ఊపులో ఆమె మరిన్ని తెలుగు చిత్రాలకు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చినా ఇచ్చేయవచ్చు. ఇదిలా ఉంటే ఈ హీరోయిన్ క్రేజ్, అదృష్టం చూసి ఇతర భామలు ఈర్ష్య పడుతుండటం విశేషం!