గతంలో 'సమరసింహారెడ్ది, నరసింహనాయుడు, చెన్న కేశవరెడ్డి, పల్నాటి బ్రహ్మనాయుడు, చినరాయుడు, పెదరాయుడు, రామన్న చౌదరి'లానే ఇప్పుడు 'అర్జున్‌రెడ్డి' చిత్రం వస్తోంది. అదే తరహాలో 'కృష్ణమాదిగ, మాల రాముడు' వంటి పేర్లతో టైటిల్స్ కూడా వస్తే బాగుంటుందని కత్తి మహేష్ అన్నాడు. ఇక దీనిని సపోర్ట్ చేస్తూ సిరాశ్రీ 'అర్జున్ శర్మ, నరసింహశాస్త్రి, పెద్ద పంతులు' వంటి బ్రాహ్మణుల పేర్లను పెట్టి హీరోయిజాన్ని పీక్స్‌లో చూపించవచ్చు కదా...! కేవలం 'సీమశాస్త్రి' అనే కామెడీ చిత్రమే వస్తే ఎలా అని తన స్నేహితుడు తనను ప్రశ్నించాడని సిరాశ్రీ తెలిపాడు.
మరో వైశ్య స్నేహితుడు అప్పుడెప్పుడే 'షావుకారు' తర్వాత సినిమా వారు మా కులాన్ని పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశాడని సిరాశ్రీ పేర్కొన్నాడు. అయినా 'స్వయంకృషి'లోని చిరంజీవి పాత్ర ఎంత గొప్పది. మన నిజజీవితాలకు రోల్ మోడల్‌గా నిలిచిన చిత్రం, పాత్ర అది. ఇక నాటి 'మాలపిల్ల' ఎంత ఎగ్రెసివ్ కథ. 'మాలపిల్ల'లోని ఉదాత్తతని మనం 'రుద్రవీణ'లో చూడవచ్చు అని సిరాశ్రీ అంటున్నాడు. టైటిల్ ఏదైనా రెడ్డి, కమ్మ కులాల ఆధిపత్యం అన్ని చోట్లా సాగుతోంది. ఇతర కులాల మనోభావాలను దెబ్బతీయనంత వరకు ఇలాంటి టైటిల్స్, కథల వల్ల ఏమాత్రం ఎవరికీ ఇబ్బంది లేదని అందరూ ఫీలవుతారు. కేవలం తమ కులమే గొప్ప అనే ఫీలింగ్ రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత మాత్రం దర్శకనిర్మాతలు, హీరోల పైన ఆధారపడి ఉందనే చెప్పాలి.
ఏ కులాన్ని ఓ పీక్ హీరోయిజంకి తీసుకెళ్లి, ఇతర కులాలను కించపరచనంత వరకు దీనిపై ఎలాంటి అభ్యంతరాలు ఎవ్వరికీ ఉండాల్సిన పనిలేదు. మరి రేపు విడుదల కానున్న 'అర్జున్‌రెడ్డి'లో రెడ్డి కులాన్ని ఎలా హైలైట్ చేస్తారో వేచిచూడాల్సివుంది...!