'మగధీర' సినిమాతో దర్శకధీరుడు రాజమౌళి, చిరంజీవి తనయుడు రామ్ చరణ్ ని స్టార్ హీరోని చేశాడు. ఆ సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీ షేక్ అయ్యింది. రాజమౌళి - రామ్ చరణ్ కాంబినేషన్ లో వచ్చిన 'మగధీర' చిత్రం ఇండస్ట్రీ హిట్టయ్యి కోట్ల కలెక్షన్స్ ని కొల్లగొట్టింది. నిర్మాత అరవింద్ కి ఈ సినిమా లాభాల పంట పండించింది. అయితే తర్వాత రామ్ చరణ్ మళ్ళీ రాజమౌళి డైరెక్షన్ లో ఛాన్స్ కోసం ఎదురు చూడలేదు. అలాగే రాజమౌళి కూడా రామ్ చరణ్ కోసం కథ సిద్ధం చేశాడనే న్యూస్ కూడా ఎక్కడా వినబడలేదు. అయితే ఇప్పుడు తాజాగా రాజమౌళి డైరెక్షన్ లో రామ్ చరణ్ ఒక సినిమా చేయబోతున్నాడని ప్రచారం మొదలైంది.
అయితే ఈ ప్రచారానికి నాంది మాత్రం చిరంజీవి 151 పోస్టర్ లాంచ్ వేదిక మీద పడింది. చిరు 151 లోగో లాంచ్ కార్యక్రమానికి రామ్ చరణ్, రాజమౌళిని గెస్ట్ గా పిలవడమే కాకుండా ఆయన చేతుల మీదుగా చిరు 'సై రా' లోగో ని, మోషన్ పోస్టర్ ని విడుదల చేయించాడు. ఇక రామ్ చరణ్, రాజమౌళిని పూల దండతో, శాలువాతో సత్కరించాడు. అలాగే రాజమౌళి కూడా రామ్ చరణ్ తో బాగా దగ్గరగా మూవ్ కావడంతోనే ఈ కాంబినేషన్ లో మూవీ ఉండబోతుంది అంటూ ప్రచారం స్టార్ట్ అయ్యింది. మగధీర కాంబినేషన్ మరలా రిపీట్ కాబోతుంది అంటూ మెగా ఫాన్స్ చెప్పుకోవడం చూస్తుంటే మనిషనేవాడెవ్వడికైనా ఆ డౌటే వస్తుంది.
అసలు రామ్ చరణ్ మాత్రం తన తండ్రి 'సై రా' కి నిర్మాతగా వ్యవహరించడం.. ఆ సినిమాని నాలుగు భాషల్లో విడుదల చెయ్యాలని చూడడం వలన ఆ సినిమాకి క్రేజ్ తీసుకురావాలంటే.... 'బాహుబలి'తో జాతీయ స్థాయిలో పేరు సంపాదించిన రాజమౌళి చేత ఈ కార్యక్రమాన్ని జరిపిస్తే ఈ సినిమాకి ఆటోమాటిక్ గా హైప్ క్రియేట్ అవుతుందని భావించే ఇలా జక్కన్నని ఈ మెగా ఈవెంట్ కి ఆహ్వానించాడుగాని మరే ఇతర కారణం లేదంటూనే.... వీరి కాంబోలో మూవీ ఉండొచ్చేమో అనే అనుమానం కూడా వ్యక్త పరుస్తున్నారు. అయితే ఆ వార్తల్లో నిజం లేకపోయినా కొట్టిపారేయ్యలేమంటున్నారు కొందరు. చూద్దాం రాజమౌళి - రామ్ చరణ్ కాంబినేషన్ ఎప్పుడు రిపీట్ అవుతుందో?