జనసేనాధిపతి పవన్‌కళ్యాణ్‌కి మంచి వ్యక్తిగా పేరున్నప్పటికీ ఎమోషనల్ పర్సన్‌గా చెప్పుకుంటారు. ఆవేశంలో ఏదో నిర్ణయం తీసుకోవడం, తర్వాత అన్ని ఆలోచించి, పలువురి సలహాల మేరకు మరలా నిర్ణయాలు గాలికి వదిలేసే స్థిమితం, స్ధిరమైన నిర్ణయం లేని వ్యక్తిగా చెబుతారు. ఇక ఆయన అక్టోబర్ నుంచి రాజకీయాలలోకి వస్తున్నానని, పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేస్తానని, వారంలో మూడు రోజులు రాజకీయాలు, ప్రజా సమస్యలకే కేటాయిస్తానని చెప్పాడు. మిగిలిన సమయంలో వీలుంటేనే సినిమాలు చేస్తానని, రాజకీయాలకు సమయం సరిపోవడం లేదని భావిస్తే తాను సినిమాలకు పూర్తిగా స్వస్తి చెబుతానని కూడా చెప్పాడు. తాను ప్రస్తుతం చేస్తున్న సినిమా కమిట్‌మెంట్ అక్టోబర్‌లో పూర్తవుతుందని, నాటి నుంచి రాజకీయాలలో యాక్టివ్‌గా ఉంటానని స్టేట్‌మెంట్ ఇచ్చాడు.
దాంతో పవన్ తాత్కాలికంగా అయినా, లేదా పూర్తిస్థాయిలో అయినా చేయబోయే చిత్రం హారిక అండ్ హాసిని బేనర్‌లో త్రివిక్రమ్ శ్రీనివాస్‌తో చేసే చిత్రమే. వచ్చే ఎన్నికలైన 2019లోపు ఆయన చేయబోయే చిత్రం ఈ ఒక్కటేనని పలువురు భావించారు. దీంతో పవన్ సినిమాలకు దూరం కావడంతో కొంత నిరాశ, రాజకీయాలకు ఎక్కువగా సమయం కేటాయించి, ప్రజలలో ఎక్కువగా గడపనుండటం ఆయన అభిమానులకు సంతోషాన్ని కలిగించాయి. కానీ ఈ నిర్ణయం తర్వాత అన్నయ్య చిరంజీవితో పాటు ఆయన సన్నిహితులు కూడా పవన్ సినిమాలలో నటిస్తునే రాజకీయాలలోకి రావాలని, లేకపోతే పార్టీకి నిధులు, ఇతర కార్యక్రమాలకు ఆర్ధిక ఆసరా లేకుండా పోతుందని పలువురు నచ్చజెప్పడంతో పవన్ కూడా మనసు మార్చుకున్నాడని, త్రివిక్రమ్ శ్రీనివాస్ చిత్రం తర్వాత సంతోష్‌శ్రీనివాస్ దర్శకత్వంలో మరో చిత్రం చేయడం ఖాయమని అంటున్నారు.