'బాహుబలి' చిత్రం విడుదలై ఇన్నిరోజులైనా ఆ చిత్రంలోని పాత్రలను, పాటలను పేరడీలుగా, ఇతర సినిమాలలో ఆయా పాత్రలను, ఆయా సీన్స్‌ని, ఆయా లోకేషన్స్‌ను ఇండియాలోని ప్రతి భాష వారూ వాడుకుంటున్నారు. మోదీ సైతం తాను కట్టప్ప పాత్రను పోషిస్తానని చెప్పేంతగా ఈ చిత్రం సంచలనాలను నమోదు చేసింది. ఇక ఇప్పటికీ పలు బాషా చిత్రాలు, టీవీ షోలలో ఈ చిత్రాన్ని వాడుకుంటూ క్రేజ్ తెచ్చుకునే ప్రయత్నం చేస్తున్నారు.
ముఖ్యంగా టాలీవుడ్ గురించో, దక్షిణాది సినిమాల గురించో టాపిక్ వస్తే అందులో బాహుబలి పేరును ఖచ్చితంగా వాడుకుంటున్నారు. దీంతో మన సినిమా వారు కూడా అదే టైప్‌లో బిహేవ్ చేస్తూ 'బాహుబలి' గురించిన ప్రస్తావన తెస్తున్నారు. ఇటీవల విడుదలైన నాని చిత్రంలో ఆయన రాజమౌళికి అసిస్టెంట్‌గా కనిపించి, ఆయన క్రేజ్‌ని బాగా వాడుకున్నాడు. ఇప్పుడు నాగచైతన్య కూడా అదే పని చేస్తున్నాడు. ఆయన హీరోగా నటించగా, అభిరుచి కలిగిన నిర్మాతగా పేరుగాంచిన సాయికొర్రపాటి తమిళ కొత్త దర్శకుడైన కృష్ణ మరిముత్తుని దర్శకునిగా పరిచయం చేస్తూ 'యుద్దం శరణం' చిత్రాన్ని తీస్తున్నాడు. ఇందులో లావణ్యత్రిపాఠి హీరోయిన్‌గా నటిస్తుండగా, శ్రీకాంత్ విలన్ పాత్రను పోషిస్తున్నాడు. ఈచిత్రం సెప్టెంబర్8న విడుదలకు సిద్దమవుతోంది.
ఇక ఈ చిత్రానికి లైన్ ప్రొడ్యూసర్‌గా రాజమౌళి తనయుడు ఎస్.ఎస్.కార్తికేయ పనిచేస్తున్నాడు. ఆయన సలహా ప్రకారం ఇందులో నాగచైతన్య 'బాహుబలి' చిత్రానికి పనిచేసే డ్రోన్ ఆపరేటర్‌గా పనిచేయనున్నాడు. సినిమా మొదటి సీన్ కూడా 'బాహుబలి' సెట్‌లోనే తీశారని సమాచారం. అలా 'బాహుబలి' క్రేజ్, ఇమేజ్‌లను నాగచైతన్య బాగానే వాడుకుంటున్నాడని చెప్పాలి.