మొదటగా బ్రిటిష్‌వారిని వణికించిన స్వాతంత్య్ర సమరయోధుడు, రాయలసీమ వీరపుత్రుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత గాధ ఆధారంగా మెగాస్టార్ చిరంజీవి టైటిల్ పాత్రలో ఆయన కుమారుడు మెగా పవర్‌స్టార్ రామ్‌చరణ్ తన 'ఖైదీ నెంబర్ 150' చిత్రం తర్వాత అత్యంత భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్న చిత్రం 'సై..రా.. నరసింహారెడ్డి'. ఈ టైటిల్ అదిరిపోయింది. 'సై...రా' అంటే తెలుగులో పౌరుషానికి ప్రతీకగా వాడుతాం. అదే పేరును అన్ని భాషలకి పెట్టినా సూట్ అవుతుంది. ఈ చిత్రం ద్వారా మెగాస్టార్ చిరంజీవి 'బాహుబలి' రికార్డులపై కన్నేశాడు.
ఇక ఇంతకాలం వార్తల్లో వస్తున్న విధంగానే.. బిగ్‌బి అమితాబ్‌బచ్చన్, తెలుగు హీరో టర్న్‌డ్ విలన్ జగపతిబాబు, కోలీవుడ్‌లో సూపర్‌హీరోయిన్‌గా ఉన్న నయనతార, కన్నడ స్టార్ కిచ్చా సుదీప్, యువతరం కోలీవుడ్ స్టార్ విజయ్‌సేతుపతి వంటి ఎందరో నటిస్తున్న ఈ చిత్రం ద్వారా బాలీవుడ్, కోలీవుడ్, మాలీవుడ్, శాండల్‌వుడ్‌లలో కూడా ఈ చిత్రానికి మంచి గుర్తింపురావడం ఖాయం.
ఇక నాగార్జున నటించిన 'మనం'లో చిన్నపాత్రను చేసి, బాలయ్యతో 'రైతు' చిత్రం చేయడానికి నిరాకరించిన బాలీవుడ్ బాద్‌షా ఈచిత్రంలో కీలకపాత్రకు ఒప్పుకోవడం నిజంగా మెగాభిమానుల్లో జోష్ నింపింది. వీరందరూ కేవలం ఆయా భాషల్లోని నటులే కాదు... తమను తాము నటులుగా నిరూపించుకుని స్టార్ స్టేటస్ పొంది 'సై...రా.. నరసింహారెడ్డి' చిత్రానికి పునాదులుగా ఉపయోగపడటం ఖాయంగా కనిపిస్తుంది.
మరోవైపు ప్రపంచ ప్రఖ్యాత సంగీత సంచలనం ఏ.ఆర్. రెహ్మాన్ సంగీతం, రవివర్మన్ సినిమాటోగ్రఫీ, రాజీవన్ ప్రొడక్షన్ డిజైనర్.. ఇలా మహామహులు ఈ చిత్రానికి పని చేస్తున్నారు. ఇక ఈ చిత్రం దర్శకుడు సురేందర్‌రెడ్డికి గొప్ప అవకాశమే కాదు.. ఎంతో కీలకం కూడా. ఇంతటి మహామహులను ఆయన ఎలా హ్యాండిల్ చేస్తాడు? వారి నుంచి ఎలాంటి అవుట్‌పుట్ తీసుకుంటాడు? అనేది ఆసక్తికరంగా మారింది. ఇంతటి మహామహులను ఒప్పించి ఈ ప్రాజెక్ట్‌కి ఓకే చేయించిన ఘనత మాత్రం రామ్‌చరణ్‌కే దక్కుతుంది...!