ఒకప్పుడు తెలుగు సినిమాల్లో హీరోయిన్ గా నటించి.... ఆ తర్వాత అసలు మీడియాకి కూడా కనబడకుండా ఉన్న నటి కస్తూరి ఈ మధ్యన అనూహ్యంగా వార్తల్లోకొచ్చేసింది. తమిళనాట సూపర్ స్టార్ రజినీకాంత్ రాజకీయ అరంగేట్రం గురించి మీడియాలో కామెంట్స్ చేసిన కస్తూరిని అప్పట్లో సూపర్ స్టార్ రజిని అభిమానులు ఆడుకున్న విషయం తెలిసిందే. అప్పటినుండి కాస్త సైలెంట్ అయిన ఈ ముదురు భామ ఇప్పుడు మరోసారి తెలుగు డైరెక్టర్ ని కామెంట్ చేసి మళ్ళీ సంచలనం అయ్యింది.
టాలీవుడ్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ మీద కస్తూరి సంచలన వ్యాఖ్యలు చేసింది. బాలకృష్ణ నటించిన 'పైసా వసూల్' ఆడియోలో ఆ సినిమా డైరెక్టర్ పూరి జగన్నాధ్, హీరో బాలకృష్ణ మీద కురిపించిన ప్రేమకు కస్తూరి ఘాటుగా స్పందించింది. ఆడియో వేడుకలో పూరి జగన్నాధ్, బాలకృష్ణ అభిమానులను కొడుతూ ఉంటారు. అది కేవలం అభిమానుల మీద ప్రేమ వల్లే ఆయన అలా చేస్తాడు.... అంటూ ఒక లవ్ స్టోరీ వినిపించాడు. ఆ విషయమై కస్తూరి స్పందిస్తూ అభిమానుల్ని బాలకృష్ణ కొట్టడంలో తప్పు లేదని డైరెక్టర్ పూరి మాట్లాడడం చూస్తుంటే.... ఆయన మీద డ్రగ్స్ ఆరోపణలు ఏ ఆధారాలు లేకుండా రాలేదని తెలుస్తోందన్నట్లుగా కస్తూరి వ్యాఖ్యానించడం ఇప్పుడు తెలుగు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అయ్యింది.
బాలకృష్ణ మీద పూరి అంతటి ప్రేమను కురిపించడంతో ఇండస్ట్రీలో చాలానే విమర్శలొచ్చినా.. కానీ ఎక్కడ అది బయటపడలేదు. అయితే తెలుగు నటులెవ్వరూ తమ తమ అభిప్రాయాలను ఈ విషయంలో బయటపెట్టకపోయినా.... ఎపుడో తెలుగు సినిమాల్లో నటించి ఇప్పుడు తెలుగుకి ఏమి కానీ నటి కస్తూరి ఇలా పూరి మీద విరుచుకుపడడం మాత్రం కొద్దిగా ఆలోచించాల్సిన విషయమే అంటున్నారు.