వచ్చేవారం అంటే ఈనెల 24న తమిళస్టార్ తలా అజిత్ నటిస్తోన్న 'వివేగం' చిత్రం భారీస్థాయిలో విడుదల కానుంది. ఇటీవలే తన కెరీర్‌లో 25ఏళ్లు దిగ్విజయంగా పూర్తి చేసుకున్న తర్వాత విడుదలవుతున్న చిత్రం కావడంతో అజిత్ అభిమానులు ఈ చిత్రం కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇక తన 25ఏళ్ల కెరీర్‌లోనే అజిత్ చేస్తున్న అతి భారీ బడ్జెట్ చిత్రంగా రూపొందుతోంది. ఇప్పటికే 'వీరం, వేదాళం' వంటి బ్లాక్‌బస్టర్స్ ఇచ్చిన దర్శకుడు శివ- అజిత్‌లు నటిస్తున్న హ్యాట్రిక్ చిత్రంగా కూడా ఈ చిత్రం రానుండటం విశేషం.
ఈ చిత్రంలో నేరస్తుల కోసం దేశవిదేశాలలో జరిగే ఇంటర్‌పోల్ ఆఫీసర్‌గా అజిత్ నటిస్తుండగా, కీలకమైన పాత్రతో కమల్‌హాసన్ చిన్నకుమార్తె అక్షరహాసన్ నటిగా తన మాతృభాషల్లో నటిస్తోంది. కాజల్ హీరోయిన్. ఇక ఈ చిత్రం ఓ హాలీవుడ్ చిత్రం రేంజ్‌లో, హాలీవుడ్ జేమ్స్‌బాండ్, క్రైమ్ చిత్రాల స్థాయిలో ఉంటుందని ప్రచారం జరుగుతోంది. ఇక ఈచిత్రం గురించి ఎడిటర్ ఆంటోని ఎల్ రూబెన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. సినిమాకు పూర్తయిన తర్వాత తొలి ప్రేక్షకులు ఆ ఎడిటరే కావడంతో ఆయన మాటలకు ఎక్కడలేని ప్రాధాన్యం ఏర్పడింది.
ఈ చిత్రం మేకింగ్‌పరంగా, స్ఫెషల్ ఎఫెక్ట్జ్, ఇతర మేకింగ్, స్టైల్ విషయాలలో రాజమౌళి 'బాహుబలి'ని పోలి ఉంటుంది. ఈ చిత్రంలోని విజువల్స్ అదిరిపోయే రేంజ్‌లో ఉంటాయి. ఈ చిత్రం కేవలం అజిత్ అభిమానులను, యాక్షన్ చిత్రాల ప్రియులనే కాదు.. ప్రతి వర్గం ప్రేక్షకుడికి ఎంతో నచ్చుతుంది. ఈ చిత్రం చూస్తుంటే అద్భుతమైన అనుభూతికి లోనయ్యాను. ఈ చిత్రాన్ని దర్శకుడు శివ ఎంతో జాగ్రత్తగా హ్యాండిల్ చేయగా తన నటనతో అజిత్ సార్ అరిపించేశాడు.. అని చెప్పుకొచ్చాడు.
చారిత్రక చిత్రం తరహాలో ఉండే 'బాహుబలి'కి సోషల్ సబ్జెక్ట్‌తో యాక్షన్ థ్రిల్లర్‌గా వస్తున్న 'వివేగం'కి పోలికే లేకపోయినా ఆ స్థాయి స్టాండర్డ్స్ ఉన్న చిత్రంగా 'వివేగం'పై ఆకాశాన్నంటే అంచనాలున్నాయి.