ఒక దశాబ్ద కాలం పాటు సక్సెస్ అనేదే లేకుండా సినిమా ఇండస్ట్రీలో హీరోగా తిరిగిన నితిన్ 'ఇష్క్, గుండెజారి గల్లంతయ్యిందే' లతో హిట్ ట్రాక్ ఎక్కాడు. అప్పటినుండి సెలక్టీవ్ కథలతో సినిమాలు చేసుకుంటూ హిట్స్ కొడుతున్న నితిన్ 'అ ఆ' సినిమా హిట్ తో బెటర్ పొజిషన్ లోకి వచ్చేశాడు. 'అ ఆ' చిత్రం తర్వాత చాలా కాలం గ్యాప్ తీసుకుని డైరెక్టర్ హను రాఘవపూడి డైరెక్షన్లో 'లై' సినిమాని చేశాడు. నితిన్ కెరీర్ లోనే భారీ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ చిత్రం ఆగష్టు 11న విడుదలై మంచి టాక్ తెచ్చుకున్నప్పటికీ కలెక్షన్స్ మాత్రం పూర్ గా వున్నాయి. రెండు ఇతర చిత్రాలతో నువ్వానేనా అని పోటీకి దిగిన నితిన్ కి నిరాశే మిగిలింది.
'లై' సినిమా హిట్ తో తన మార్కెట్ ని పెంచేసుకోవాలని ఆశపడిన నితిన్, పోటీగా 'లై' ని దింపి ఇప్పుడు చాలా బాధపడుతున్నాడు. 'నేనే రాజు నేనే మంత్రి, జయ జానకి నాయక'తో పెట్టుకుని 'లై' బాక్సాఫీస్ వద్ద చాలా ఇబ్బంది పడుతుంది. ఫస్ట్ వీక్ లో 'లై' కలెక్షన్స్ ఏమంత గొప్పగా లేకపోగా సెకండ్ వీక్ లోనైనా పుంజుకుంటుంది అనుకున్న చిత్ర యూనిట్ కి మళ్ళీ నిరాశే ఎదురయ్యేలా వుంది. 'నేనే రాజు నేనే మంత్రి, జయ జానకి నాయక' చిత్రాల కలెక్షన్స్ పెరగడమే కాదు ఈ సెకండ్ వీక్ కూడా నిలకడగా కలెక్షన్స్ సాధించేలా కనబడుతున్నాయి.
కొత్త హీరోయిన్ మేఘ ఆకాష్, కొత్త విలన్ అర్జున్, నితిన్ నటన, కొత్త కథ... మైండ్ గేమ్ కాన్సెప్ట్ అన్ని కొత్తగానే ఉన్నప్పటికీ ప్రేక్షకులు మాత్రం ఈ సినిమాని లెక్కలోకి తీసుకోవడం లేదు. మరి క్లాస్ చిత్రాలుగా విడుదలైన 'నిన్ను కోరి, ఫిదా' చిత్రాలు మంచి కలెక్షన్స్ కొట్టెయ్యగా నితిన్ 'లై' మాత్రం క్లాస్ మూవీగా ప్రేక్షకుల ముందుకు వచ్చినా..ఆ చిత్రాల ఫేట్ అందుకోలేకపోయింది. మరి ఇప్పుడు నితిన్ 'లై' చిత్రం నితిన్ కెరీర్ లోనే మరో ప్లాపుని మూటగట్టుకునేలా కనబడుతుంది. కనీసం సోలోగా వచ్చినా ఇంత భారీ నష్టం నుండి 'లై' తప్పించుకునేదేమో అనే అభిప్రాయాన్ని వ్యక్తం చేసున్నారు.