తెలుగు, తమిళంలో కూడా 'మహానటి'గా పేరు తెచ్చుకున్న నటి మహానటి సావిత్రి. అందానికి, నటనకు ఆమె నిలువెత్తు నిదర్శనం. నేటితరం వారికి ఆమె నటన బాలశిక్ష వంటిది. కానీ నటిగా మహానటి అయినా ఆమె జీవితం మాత్రం కుక్కలు చించిన ఇస్తరిగా మారింది. ఆమె పోయి పోయి తమిళులు రొమాంటిక్ కింగ్‌గా, కింగ్ ఆఫ్ రొమాన్స్‌గా పిలుచుకునే జెమినీ గణేషన్‌ని రెండో వివాహం చేసుకుని, తన అందంతో పాటు తాను జీవితాంతం సాధించిన డబ్బు, కీర్తి ప్రతిష్టలు కోల్పోయి చివరి రోజుల్లో దుస్థితిని అనుభవించింది. కానీ జెమిని గణేషన్‌కి నేడు కూడా తమిళంలో వీరాభిమానులు ఉన్నారు.
దాంతో జెమిని గణేషన్ పాత్ర స్టార్ సూర్యకి చేయాలని ఉన్నా, తమిళంలో వివాదాలు వస్తాయని ఆయన చేయలేదు. ఇక ఈ చిత్రాన్ని అశ్వనీదత్ అల్లుడైన 'ఎవడే సుబ్రహ్మణ్యం' ఫేమ్ నాగ్ అశ్విన్ దర్శకత్వం వహిస్తుండగా, అశ్వనీదత్ కుమార్తెలైనా స్వప్నాదత్, ప్రియా దత్‌లు నిర్మిస్తున్నారు. నాటి కాలానికి తగ్గ సెట్స్‌ని వేసి ఈ చిత్రాన్ని కేవలం తెలుగులోనే గాక తమిళం, మలయాళ భాషల్లో కూడా నిర్మిస్తున్నారు. దానికి అనుగుణంగా మలయాళంలో పేరున్న యువహీరో, మమ్ముట్టి తనయుడు 'ఓకే బంగారం' ఫేమ్ దుల్కర్ సల్మాన్ ని జెమిని గణేషన్ పాత్ర కోసం ఎంపిక చేశారు. ఇక మహానటిగా కీర్తిసురేష్ నటిస్తోంది. ఈ ఇద్దరికి సంబంధించి విడుదలైన సినిమా లుక్‌లను చూస్తే అచ్చు జెమినిగణేషన్-సావిత్రిలను కళ్ల ముందు ఉంచుతున్నారు.
కాగా ఈ చిత్రంలో ఎన్టీఆర్, ఏయన్నార్‌ల పాత్రలతో పాటు ఎస్వీరంగారావు పాత్ర కూడా కీలకమైంది. ఆమద్య ఎస్వీరంగారావు పాత్రను ప్రకాష్‌రాజ్ చేస్తున్నట్లు వార్తలు వచ్చాయి. ఈచిత్రంలో ప్రకాష్‌రాజ్ నటిస్తోంది నిజమే గానీ ఆయన పోషించే పాత్ర అదికాదు.. సావిత్రిని ఎంతగానో నటిగా ప్రోత్సహించి ఆమెతో 'మిస్సమ్మ, మాయాబజార్, గుండమ్మకథ'వంటి చిత్రాలను నిర్మించిన విజయా సంస్థ అధినేతల్లో ఒకరైన చక్రపాణి పాత్ర. మరి నాగిరెడ్డిగా ఎవరు నటిస్తారో చూడాలి..! మరోవైపు ఎస్వీరంగారావు పాత్రను మోహన్‌బాబు నటిస్తాడని వార్తలు వస్తున్నాయి. కాగా ఈ చిత్రంలో సమంత కూడా కీలకపాత్రను చేస్తున్న సంగతి తెలిసిందే.