గత కొంతకాలంగా కోలీవుడ్‌కి సరైన హిట్ లేదు. దీంతో అందరు అజిత్ నటిస్తున్న'వివేగం'పై ఆశలు పెట్టుకుని ఉన్నారు. ఇక ఇటీవలికాలంలో తమిళంలో అనూహ్యమైన విజయం సాధించిన చిత్రం మాత్రం ఖచ్చితంగా 'విక్రమ్ వేద' చిత్రం మాత్రమే. ఇందులో మాధవన్ సిన్సియర్, అండ్ ఎన్‌కౌంటర్ అయిన పోలీసు ఆఫీసర్‌గా నటించగా, విజయ్‌సేతుపతి గ్యాంగ్‌స్టర్ రోల్‌ని పోషించాడు. ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చిన ఈచిత్రం మంచి హిట్‌గా నిలిచింది. ఇక విక్రమ-బేతాళ కథల ఆధారంగా రూపొందిన ఈ చిత్రానికి పుష్కర్ -గాయత్రి అనే దర్శకద్వయం పనిచేశారు. వీరిద్దరు నిజజీవితంలో భార్యాభర్తలు కావడం విశేషం.
ఆ మధ్య చిత్ర నిర్మాత శశికాంత్‌తో పాటు యూనిట్ సభ్యులు ఈ చిత్రాన్ని తెలుగులో రీమేక్ చేయనున్నామని, మాధవన్ పాత్రను వెంకటేష్, విజయ్‌సేతుపతి పాత్రను రానా దగ్గుబాటిని చేయమని అడుగుతున్నామని చెప్పారు. మరి ఈ విషయంలో ప్రోగ్రెస్ ఎంత వరకు ఉందో తెలియదు. తాజాగా నిర్మాత శశికాంత్ సన్నిహితుల సమాచారం బట్టి ఈ చిత్రంలో గ్యాంగ్‌స్టర్ నాగార్జునని అడుగుతున్నామని, పోలీస్ ఆఫీసర్ పాత్రను మాధవన్‌నే పోషించనున్నాడని అంటున్నారు. అదే జరిగితే మాధవన్ సోలోగా నటించిన సీన్స్‌ని మరలా చిత్రీకరించుకోవాల్సిన అవసరం లేకుండా ఉన్నది ఉన్నట్లుగా వాడుకోవచ్చు. దాని వల్ల బడ్జెట్ తగ్గుతుంది.
ఇక కొత్త కథ, సరికొత్త స్క్రీన్‌ప్లే కావడంతో నాగార్జున కూడా ఈ చిత్రంపై ఆసక్తి చూపవచ్చని అదే జరిగితే సినిమాకి మంచి మైలేజ్ వస్తుందని భావిస్తున్నారు. ఇక ఇలాచేస్తే 'ఊపిరి' చిత్రం తర్వాత ఓ తమిళ హీరోతో కలిసి నాగార్జున నటించే రెండో మల్టీస్టారర్ ఇదే కానుంది...!