ఒకే రోజున ఎన్ని చిత్రాలు వచ్చినా ఫర్వాలేదని, వాటిని తట్టుకునే శక్తి తెలుగు సినిమాకి ఉందని చెబుతున్న వాదనలు ఆగష్టు11న వచ్చిన 'నేనే రాజు నేనే మంత్రి, జయ జానకి నాయక, లై' చిత్రాలతో తప్పని తేలిపోయింది. ఏదో పండగలకు, ఇతర వేసవి, దసరాలకు తప్ప ఇది అందరి విషయంలో నిజం కాదనేది వాస్తవం. ఆగష్టు11న విడుదలైన అన్ని చిత్రాలు బాగానే ఉన్నప్పటికీ అన్ని చిత్రాలు వసూళ్లని పంచుకున్నాయి.
ఇక వచ్చే సంక్రాంతికి ముందుగా వచ్చే డిసెంబర్‌లోనే క్రిస్మస్ పండుగకు కూడా సినిమాలు పోటీపడనున్నాయి. తాజా సమాచారం ప్రకారం తన చిన్న కుమారుడు అక్కినేని అఖిల్ మొదటి చిత్రం డిజాస్టర్ కావడంతో ఆయన రెండో చిత్రాన్ని స్వయంగా అన్నపూర్ణ బేనర్‌లో నాగార్జుననే నిర్మిస్తున్నాడు. ఈ ఫ్యామిలీకి 'మనం' వంటి క్లాసికల్ హిట్‌ని ఇచ్చిన విక్రమ్ కె.కుమార్ దర్శకత్వం వహిస్తుండగా, వినోద్ సినిమాటోగ్రఫీని అందిస్తుండటం విశేషం. ఇందులో విడుదలైన ఓ పోస్టర్‌ని చూస్తే ఇది క్లాస్ లవ్‌స్టోరీగా అనిపిస్తోంది. ఈ చిత్రం రషెష్ చూసిన తర్వాత సామాన్యంగా తొందరపడని నాగార్జున సైతం తమ చిత్రం తనకు అచ్చి వచ్చిన డిసెంటర్, క్రిస్మస్ సెంటిమెంట్‌గా డిసెంబర్ 22న విడుదల అని ప్రకటించాడు.
ఇక 'జున్ను, రంగులరాట్నం' వంటి టైటిల్స్‌ని అన్నపూర్ణ బేనర్ లో రిజిష్టర్ చేసినా నాగార్జున-అమలలు కలసి నటించిన 'నిర్ణయం' చిత్రంలోని 'హలో గురూ ప్రేమ కోసమేరేయ్' అనే టైటిల్‌ని అనుకుంటున్నారు. ఈ పాట ఉన్న చిత్రంలో అఖిల్ అక్కినేని తల్లిదండ్రులైన నాగార్జున-అమలలు నటించగా, అఖిల్ సరసన నటిస్తున్న కళ్యాణి ప్రియదర్శన్ తండ్రి ప్రియదర్శన్ ఈ 'నిర్ణయం' చిత్రానికి దర్శకత్వం వహించాడు.
ఇక అదే సమయంలో దిల్‌రాజు-వేణు శ్రీరాం- నాని- సాయిపల్లవి నటిస్తున్న 'ఎంసీఏ', 'పిల్ల జమీందార్' ఫేమ్ అశోక్ దర్శకత్వంలో యువి క్రియేషన్స్ సంస్థ అనుష్క లీడ్‌రోల్‌లో నిర్మిస్తున్న 'భాగమతి', రామ్- కిషోర్‌తిరుమల కాంబినేషన్‌లో రూపొందుతున్న 'ఉన్నది ఒక్కటే జిందగీ' చిత్రాలు కూడా డేట్స్‌ని చూసుకుంటున్నాయి. ఈ ముగ్గురు నిర్మాతలలో నాగార్జునకి మంచి అనుబంధమే ఉన్న రీత్యా సోలోగా అఖిల్ రెండో చిత్రాన్ని ఎలాగైనా మేనేజ్ చేస్తాడని అంటున్నారు.