ఆగష్టు11న లాంగ్ వీకెండ్ సందర్భంగా ఏ దర్శకనిర్మాత కాంప్రమైజ్ కాలేదు. దాంతో మూడు చిత్రాలు పోటా పోటీన విడుదలయ్యాయి. అన్ని చిత్రాలు బాగానే ఉన్నా బెల్లంకొండ సాయిశ్రీనివాస్ హీరోగా బోయపాటి దర్శకత్వంలో వచ్చిన 'జయ జానకి నాయకా' క్రెడిట్ మాత్రం పూర్తిగా బోయపాటి ఖాతాలోనే పడుతుంది. ఒకేసారి దిల్‌రాజు 'లై'తో పాటు 'జయ జానకి నాయక'లను విడుదల చేయడం వల్ల, ముందుగా తన 'నేనే రాజు నేనే మంత్రి' విషయంలో సురేష్‌బాబు ముందు జాగ్రత్తతో ఎక్కువ థియేటర్లను దక్కించుకోవడంతో ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద వారం దాటిన తర్వాత ఈ చిత్రాల ఫలితం ఇప్పుడిప్పుడే తెలుస్తోంది.
సరైనన్ని ధియేటర్లు దక్కని కారణంగా తక్కువ థియేటర్లలో సర్దుకున్న 'జయ జానకి నాయక' చిత్రం కలెక్షన్ల విషయంలో మాత్రం 'నేనే రాజు నేనే మంత్రి'తో బాగానే పోటీ పడుతోంది. ఈ రెండు చిత్రాల కలెక్షన్ల మద్య కేవలం రెండు కోట్లు మాత్రమే తేడా కనిపిస్తోంది. అలా రెండుకోట్లు తక్కువ వసూలు చేసిన 'జయ జానకి నాయక'కి ఆ లోటు కూడా నైజాం నుంచే వచ్చింది. మిగిలిన అన్ని సెంటర్లలోనూ రానా చిత్రానికి బోయపాటి చిత్రం బాగానే పోటీ ఇస్తోంది.
ఇక 'లై' చిత్రం విభిన్నం అయినా ఈ చిత్రం మౌత్ టాక్‌కి అనుగుణంగా కలెక్షన్లు సాధించలేకపోతోంది. అదే సోలోగా వచ్చి ఉంటే మాత్రం 'లై' పోటీలో నిలబడి ఉండేది. ఇక 'బాహుబలి'లో క్రేజ్ పెరిగిన రానా, కాజల్, కేధరిన్ వంటి వారితో బెల్లంకొండ సాయిశ్రీనివాస్, రకుల్‌ప్రీత్‌సింగ్, ప్రగ్యాజైస్వాల్, కేధరిన్‌లు నటించిన 'జయ జానకి నాయక' చిత్రం ఇప్పటికీ బిసీ సెంటర్లలో హౌస్ ఫుల్స్ తో రన్ అవుతూ, మరింతగా థియేటర్లను పెంచుకోవాలని భావిస్తోందిట. ఏదిఏమైనా పోరు ముగిసిందని, ఇకపై కొత్త చిత్రాల వల్ల ఈ చిత్రాలకు పెద్దగా కలెక్షన్లను ఆశించడం కూడా సమంజసం కాదని ట్రేడ్‌వర్గాలు సూచిస్తున్నాయి.