బాలయ్య బి, సి సెంటర్స్ కే పరిమితమా?
బాలకృష్ణ నటించిన 'పైసా వసూల్' థియేట్రికల్ ట్రైలర్ విడుదలై యూట్యూబ్ లో రచ్చ చేస్తుంది. ఈ 'పైసా వసూల్' ట్రైలర్ తో నందమూరి అభిమానులకి ఎక్కడలేని ఆనందం రావడమే కాదు, బాలయ్య ఎనర్జీకి వీరికి పూనకాలొచ్చేస్తున్నాయ్. అయితే అభిమానులకు విపరీతంగా నచ్చిన బాలయ్య 'పైసా వసూల్' ట్రైలర్ మాత్రం క్లాస్ ఆడియన్స్ కి పెద్దగా ఎక్కలేదనే టాక్ వినబడుతుంది. పూరి జగన్నాధ్ ఎప్పటిలాగే అంటే తన గత చిత్రాల వలే ఈ చిత్రాన్ని కూడా తెరకెక్కించాడని..... ఈ 'పైసా వసూల్' ట్రైలర్ ఏమంత కొత్తగా లేదంటూ పెదవి విరుస్తున్నారు.
మరోపక్క బాలకృష్ణ ఎనర్జీ సూపర్ అంటూనే బాలకృష్ణ వాయిస్ మాత్రం నచ్చలేదని మొహం మీదే చెప్పేస్తున్నారు కొందరు. మరి ఇలాంటి మిక్స్డ్ టాక్ తో 'పైసా వసూల్' ట్రైలర్ ని చూసిన కొద్దిమంది మాత్రం ఈ ట్రైలర్ చూశాక.. పైసా వసూల్ కి 'ఏ' సెంటర్స్ లో పైసల్ రావేమో అనే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. అయితే బాలయ్య 'పైసా వసూల్' మాత్రం బిసి సెంటర్స్ లో కలెక్షన్స్ కొల్లగొడుతుందనే నమ్మకాన్ని మరికొంతమంది వ్యక్తం చేస్తున్నారు కూడా. కొన్ని చిత్రాలను దర్శకులు ఒక్క క్లాస్ ఆడియన్స్ ని మాత్రమే దృష్టిలో పెట్టుకుని తెరకెక్కించరు. వారు క్లాస్, మాస్ ఆడియన్స్ ని దృష్టిలో పెట్టుకుని తెరకెక్కిస్తారు. ఎక్కువగా మాస్ మీదే ఎఫర్ట్ పెట్టడంతో సినిమా ఒక మాదిరిగా ఆడినా మంచి కలెక్షన్స్ తో దున్నేస్తుంది.
ఇక 'పైసా వసూల్' లో బిసి సెంటర్స్ కి ఏం కావాలో అది ఉందంటున్నారు. 'నాపేరు తేడా సింగ్... దిమాక్ తోడా... నేను చాలా తేడా, గొడవల్లో గోల్డ్ మెడల్స్ వచ్చినోణ్ని... మళ్ళీ టోర్నమెంట్ లు పెట్టొద్దు, కసి తీరకపోతే శవాన్ని కూడా లేపి చంపేస్తా' వంటి డైలాగ్స్ కి బిసి సెంటర్స్ లో మాస్ ఆడియన్స్ కుర్చీల్లో కూర్చోకుండా విజిల్స్ తో థియేటర్స్ లో రచ్చ చెయ్యడం మాత్రం ఖాయం అంటున్నారు. ఇక ఇలా మాస్ టాక్ తో విడుదలైన సినిమాలన్నీ కచ్చితంగా కోట్లు కొల్లగొట్టాయని.. ఇక ఇప్పుడు బాలయ్య 'పైసా వసూల్' కూడా కోట్లు కొల్లగొట్టడం ఖాయమనే అభిప్రాయాలను ట్రేడ్ వర్గాలు కూడా వ్యక్తం చేస్తున్నాయి.
ఇక దెబ్బకి 'పైసా వసూల్' మాత్రం 100 కోట్ల క్లబ్బుని టచ్ చెయ్యడం అనేది జరిగి తీరుతుందని.... నందమూరి అభిమానుల బెట్టింగ్స్ మాత్రం 'పైసా వసూల్' ట్రైలర్ తో ఇంకాస్త పెరిగాయని టాక్ వినబడుతుంది.