మహేష్ - మురుగదాస్ కాంబినేషన్ లో వస్తున్న 'స్పైడర్' చిత్రం తెలుగు, తమిళ్ లో ఏక కాలంలో తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఈ చిత్రాన్ని రెండు భాషల్లో ఒకే రోజు గ్రాండ్ గా రిలీజ్ కి సిద్ధం చేస్తున్నారు. సెప్టెంబర్ 27 న దసరా కానుకగా విడుదల చెయ్యబోతున్న 'స్పైడర్' చిత్రాన్ని అక్కడ తమిళంలో కూడా అదిరిపోయే లెవల్లో విడుదలకు ఏర్పాట్లు చేస్తున్నాడు మురుగదాస్. మరి మహేష్ కేవలం డబ్బింగ్ సినిమాల్తోనే ఇప్పటివరకు తమిళులకు పరిచయమయ్యాడు. కానీ ఇప్పుడు 'స్పైడర్' తో డైరెక్ట్ గా తమిళ ప్రేక్షకులకు చేరువవ్వాలనే ఉద్దేశ్యంతో 'స్పైడర్' లో తన పాత్రకు తానే తమిళ డబ్బింగ్ కూడా చెప్పుకున్నాడు.
అలాగే 'స్పైడర్' చిత్రంతో తమిళంలో గ్రాండ్ గా ఎంట్రీ ఇవ్వబోతున్న మహేష్ ని తమిళులకు పరిచయం చేసే వేడుకని కూడా అంతే గ్రాండ్ లెవల్లో చెన్నైలో నిర్వహించడానికి ఏర్పాట్లు చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే మహేష్ తమిళ లాంచింగ్ వేడుకకి సూపర్ స్టార్ రజినీకాంత్ రాబోతున్నాడంటూ కోలీవుడ్ మీడియాలో కథనాలు వెలువడుతున్నాయి. రజినీకాంత్ తో పాటు '2 .0' డైరెక్టర్ శంకర్ కూడా రానున్నాడనే న్యూస్ ఇప్పుడు కోలీవుడ్ లో హాట్ టాపిక్ అయ్యింది. అయితే సామాన్యంగా ఇతర హీరోల వేడుకలకు పెద్దగా హాజరవ్వని రజిని ఇప్పుడు మహేష్ తమిళ లాంచింగ్ కోసం తరలి రావడం అనేది విశేషమే.
అయితే రజిని, శంకర్ లు లైకా ప్రొడక్షన్ కోరిక మేరకే ఇలా ఈ ఈవెంట్ కి హాజరవుతున్నారనే టాక్ కూడా వినబడుతుంది. 'స్పైడర్' చిత్రాన్ని తెలుగులో ఠాగూర్ మధు నిర్మించినప్పటికీ.... తమిళ హక్కులను లైకా ప్రొడక్షన్ వారు ఎగరేసుకుపోయిన సంగతి తెలిసిందే. ఈ లైకా ప్రొడక్షన్స్ వారు రజినీకాంత్ '2 .0' చిత్రాన్ని నిర్మించే నిర్మాతలు కూడా కావడంతో వారు మహేష్ తమిళ లాంచింగ్ కోసం రజిని ని గెస్ట్ గా ఆహ్వానించబట్టే రజిని ఈ వేడుకకి హాజరవుతున్నాడని చెబుతున్నారు. చూద్దాం సెప్టెంబర్ 9 న ఏం జరగబోతుందో...?