సినిమా ఇండస్ట్రీలో అజాత శత్రువులు వుండరు, అజాత మిత్రులు ఉండరు. ఎప్పటికప్పుడు శత్రువులు మారిపోతుంటారు. అలాగే మిత్రులు కూడా సైలెంట్ గా విడిపోతూనే వుంటారు. తెలుగు సినిమా ఇండస్ట్రీలో పవన్ కళ్యాణ్ తో స్నేహం చేసిన ఎవరైనా ఆయన వ్యక్తిత్వానికి ముగ్దులై ఆయనతో ఉండడానికే ఎక్కువగా ఇష్టపడుతుంటారు. అలా ఎక్కువగా పవన్ తో స్నేహాన్ని కొనసాగిస్తున్నది మాత్రం ఒక్క త్రివిక్రమ్ మాత్రమే అని అనుకోవాలి. దర్శకుడు త్రివిక్రమ్, పవన్ కళ్యాణ్ లు చాలా కాలం నుండి మంచి స్నేహితులుగా వుంటున్నారు. అయితే ప్రస్తుతం ఇండస్ట్రీలో పవన్ కళ్యాణ్ తో ఎక్కువ కాలం స్నేహాన్ని కొనసాగించి త్రివిక్రమ్ అయితే రికార్డు సృష్టించాడు. పవన్ కళ్యాణ్ తన మనసుకు నచ్చిన వారితో ఎక్కువగా స్నేహం చేస్తాడు.
అయితే టాలీవుడ్ లోని కొందరు నిర్మాతలతో పవన్ కళ్యాణ్ కొన్ని రోజులు స్నేహాన్ని కొనసాగించడం... ఆ తర్వాత వారిని దూరం పెట్టడం అనేది అతని నైజం అనుకుంటారు అంతా. కానీ వారే పవన్ తో ఎక్కువగా క్లోజ్ అవడము ఆ తర్వాత సైడ్ అవడము చేస్తుంటారు. గతంలో బండ్ల గణేష్, పవన్ తో సినిమా చేసేటప్పుడు... పవన్ పర్సనల్ పనులు కూడా తానే చూస్తానని బిల్డప్ ఇచ్చేవాడు. పవన్ ఎక్కడుంటే అక్కడ వాలిపోయి పవన్ ని అంటిపెట్టుకుని తిరిగేవాడు. కానీ ఆ తర్వాత పవన్ కంటిచూపుమేర కనబడకుండా మాయమయ్యాడు. ఇక పివిపి కూడా పవన్ తో కొన్నాళ్ళు స్నేహాన్ని కొనసాగించి ఎంపీ సీట్ పవన్ తనకి ఇప్పించలేదనే కారణంగా పవన్ దగ్గర నుండి సైడ్ అయ్యాడు.
ఆ తర్వాత పివిపి ప్లేస్ లోకి శరత్ మరార్ వచ్చి చేరాడు. శరత్, పవన్ సినిమాలు నిర్మిస్తూ పవన్ తో పాటే అన్ని చోట్ల ప్రత్యక్షమవడమే కాదు పవన్ ను అంటిపెట్టుకుని తిరిగేవాడు. పవన్ తో చేసిన సినిమాలన్నీ నష్టాలూ మిగిల్చి చేతులుకాలాకా పవన్ పక్కనుండి తప్పుకుని తనపని తానూ చేసుకుంటున్నాడు. అయితే శరత్ మరార్ కి పవన్ కళ్యాణ్ కి మధ్యన విభేదాలు రావడంతోనే శరత్, పవన్ నుండి విడిపోయాడనే ప్రచారం జోరుగా జరుగుతుంది. అందుకే పవన్ ఆఫీస్ కి గాని పవన్ దగ్గరికి గాని శరత్ రావడం లేదంటున్నారు. ఇక 'కాటమరాయుడు' సినిమా మిగిల్చిన నష్టాల వల్ల డిస్ట్రిబ్యూటర్స్ చేసిన గొడవతో వీరి స్నేహం చెడిపోయిందని అంటున్నారు.
మరి పవన్ అయితే తన స్నేహాన్ని తొందరగా వదులుకునే మనిషి కాదంటారు గాని.. ఇప్పుడు పవన్ నుండి విడిపోయిన వీళ్ళని చూస్తుంటే పవన్ కావాలని దూరం చేసుకున్నట్టు లేదు... వీరే ఏదో ఆశించి దూరమయ్యారని అనుకోవాలేమో..?