'పైసా వసూల్' ఆడియో వేడుక ఖమ్మంలో అతిధుల సమక్షంలో అంగరంగ వైభవంగా జరిగింది. నందమూరి అభిమానులు వర్షాన్ని సైతం లెక్కచెయ్యకుండా పాల్గొని ఈ ఆడియో వేడుకని విజయవంతం చేశారు. ఇక 'పైసా వసూల్' ఆడియో వేడుకకి 'పైసా వసూల్' హీరో బాలకృష్ణతో పాటే హీరోయిన్స్ శ్రియ, ముస్కాన్, కైరా మరియు ఛార్మీలు హాజరయ్యారు. ఇక డైరెక్టర్ పూరి జగన్నాధ్ తోపాటు డైరెక్టర్ బోయపాటి, డైరెక్టర్ క్రిష్ లు కూడా ఖమ్మంలో జరిగిన ఈ ఆడియో లాంచ్ వేడుకకి తరలి వచ్చారు. ఈ వేడుకలో అతిదులందరూ జై బాలయ్య అంటూ తమ తమ ఉపన్యాసాలు ఇచ్చుకుంటూ పోయారు.
అయితే 'పైసా వసూల్' డైరెక్టర్ పూరి జగన్నాధ్ మాట్లాడింది మాత్రం ఇప్పుడు సంచలనం అయ్యింది. ఆయన బాలయ్య గురించి మాట్లాడుతూ బాలకృష్ణ గారితో సినిమా చెయ్యాలనే నా ఎప్పటిదో కల ఇప్పుడు 'పైసా వసూల్' తో తీరిందని... బాలకృష్ణ తో సినిమా డైరెక్ట్ చెయ్యడం తన అదృష్టంగా భావిస్తున్నానని.... బాలకృష్ణ ఎనర్జీకి ఎంతో ఫిదా అయ్యానని... అంతలా బాలకృష్ణ 'పైసా వసూల్' సెట్స్ లో సందడి చేశాడని చెబుతూనే బాలయ్య బాబు ముక్కుసూటి మనిషని... ఆయనకు కొంచెం కోపం ఎక్కువేనని పూరి జగన్నాధ్ చెబుతున్నాడు. ఆ కోపం మాత్రం ఎక్కువైతే ఆయన అభిమానులను కొట్టేస్తుంటాడని కూడా చెప్పాడు.
అయితే పూరి జగన్నాధ్... బాలయ్య అభిమానులను కొట్టడంపై తనదైన స్టయిల్లో సమాధానం చెప్పి అభిమానులను కాస్త కూల్ చేశాడనుకోవచ్చు. ఇంతకీ బాలకృష్ణ గత రాత్రి నంద్యాల ఎన్నికల నేపథ్యంలో అభిమానిపై చెయ్యి చేసుకున్నాడనే న్యూస్ ఈ గురువారం మీడియాలో వైరల్ అయిన విషయం గురించి ప్రస్తావించిన పూరి.... బాలకృష్ణ అభిమాని కొట్టాడని మీడియాలో తెగ న్యూస్ వస్తుంది. అసలు బాలయ్య కొట్టిన అభిమాని బాలకృష్ణ కొట్టడంపై ఎంతో హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నాడని చెప్పి షాక్ ఇచ్చాడు. బాలకృష్ణ అభిమానిని కొట్టాడని కాంట్రవర్సీ అవుతుంది గాని.... అసలు బాలయ్య కొట్టడాన్ని ఆయన అభిమానులు ఎంతో ఎంజాయ్ చేస్తారని చెబుతున్నాడు పూరి.
బాలకృష్ణ కి ఎంతోకోపం వస్తే గాని చెయ్యి చేసుకోడని... ఆయనకి అంతలా కోపం తెప్పించబట్టే అలా అభిమానుల మీద చెయ్యిచేసుకునే పరిస్థితి వస్తుందని వివరణ కూడా ఇచ్చేశాడు. మరి నిజంగానే బాలయ్య దెబ్బలని అభిమానులు ఎంజాయ్ చేస్తున్నారా? లేకుంటే ఈయన కోపాన్ని దగ్గరగా చూసి జడుసుకుని సైలెంట్ అయ్యారా అనేది దెబ్బలుతిన్న అభిమానులకే తెలియాలి.