రెండు అడుగులు వెనక్కి వేసి..రెండు వారాల వెనక్కి వెళ్లిన నాగచైతన్య నటిస్తున్న 'యుద్దం శరణం' చిత్రం సెప్టెంబర్ 8వ తేదీన రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకుంది. 'ప్రేమమ్', 'రా రండోయ్ వేడుక చూద్దాం'లతో చైతూ కెరీర్ ప్రస్తుతం మంచి ఊపు మీదుంది. ప్రేమ, ఫ్యామిలీ సెంటిమెంట్, క్లాస్ చిత్రాల పరంగా ఆల్‌రెడీ నాగచైతన్య తానేంటో ప్రూవ్ చేసుకున్నాడు. ఇక ఆయనకు మాస్ హీరోగా 'తడాఖా' చిత్రం హిట్టయినా ఇందులో సునీల్ కూడా కలిసి నటించడం, ఇది రీమేక్ మూవీ కావడంతో చైతూ ఇంకా యాక్షన్ హీరోగా తన పూర్తి సత్తాను ఇప్పటికీ చూపలేదని పలువురు భావిస్తున్నారు.
ఈ సారి ఆ టైప్‌లో చైతూ సరికొత్త కథ, స్క్రీన్‌ప్లే, లవ్, ఎమోషన్స్ అన్ని కలగలిపి యాక్షన్ థ్రిల్లర్ జోనర్‌లో 'యుద్దం శరణం' చిత్రం చేస్తున్నాడు. అభిరుచి ఉన్న నిర్మాత సాయికొర్రపాటి నిర్మిస్తుండగా, తమిళ దర్శకుడు కృష్ణ మరిముత్తు ఈచిత్రం ద్వారా దర్శకునిగా పరిచయం అవుతున్నాడు. ఇక ఇందులో నాగచైతన్య లుక్స్ నుంచి ప్రతి విషయంలోనూ వైవిధ్యంగా కనిపిస్తాడని, ఆయన కిందటి చిత్రాల కంటే 'యుద్దం శరణం' భిన్నంగా, చైతూని మరోస్థాయికి తీసుకెళ్లేలా ఉంటుందని యూనిట్ ఎంతో నమ్మకంతో చెబుతోంది.
తనకెరీర్ మొదట్లో కొన్ని చిత్రాలలో విలన్ వేషాలు వేసి ఆ తర్వాత ఫ్యామిలీ హీరోగా మారిన శ్రీకాంత్ ఈ చిత్రం ద్వారా ప్రతినాయకునిగా పరిచయం అవుతుండగా, లావణ్యత్రిపాఠి హీరోయిన్‌గా నటిస్తోంది. ఇప్పటికే ట్రైలర్‌తో ఆకట్టుకున్న ఈచిత్రం వైవిధ్యభరితంగా ఉండటం ఖాయంగా కనిపిస్తోంది. చైతూ ఈ చిత్రం కోసం చాలా కష్టపడుతున్నాడట. ఈ చిత్రాన్ని వరల్డ్ వైడ్‌గా సెప్టెంబర్ 8న విడుదల చేస్తున్నామంటూ రిలీజ్ డేట్‌ని పోస్టర్ ద్వారా అనౌన్స్ చేశారు. ఇక సెప్టెంబర్ 1న విడుదలవుతున్న 'పైసా వసూల్' తదుపరి వారం ఈ చిత్రం థియేటర్లకు రానుండటం అంటే నిజంగా చైతు యుద్ధం చేస్తున్నట్లే లెక్క. ప్రస్తుతం వేగంగా జరుగుతున్న పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలతో పాటు త్వరలో ఈ చిత్రం ఆడియోని కూడా విడుదల చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి.