ఎన్నో విజయవంతమైన చిత్రాలకు వక్కంతం వంశీ కథలను అందించి తెలుగులో స్టార్ రైటర్‌గా పేరు తెచ్చుకున్నాడు. ఇక ఎంతో కాలం ఎన్టీఆర్ డైరెక్షన్ చాన్స్ ఇస్తాడేమోనని వెయిటింగ్ చేశాడు. కానీ ఎన్టీఆర్ హోల్డ్‌లో పెట్టడంతో వక్కంతం వంశీ బయటకు వచ్చి అల్లు అర్జున్‌కి 'నా పేరు సూర్య.. నా ఇల్లు ఇండియా' అనే దేశభక్తిపరమైన స్టోరీని చెప్పడం, ఇందులో తాను పోషించబోయే మిలిటరీ ఆఫీసర్ పాత్ర ఎంతో వైవిధ్యంగా, ఎంతో పవర్‌ఫుల్‌గా ఉండటంతో బన్నీ సైతం ఆయనకు దర్శకునిగా అవకాశం ఇవ్వడం జరిగిపోయాయి.
ప్రస్తుతం ఈ చిత్రం షూటింగ్ జరుగుతోంది. ఇక ఈ చిత్రాన్ని లగడపాటి శ్రీధర్, శిరీష్‌లు నిర్మిస్తుండటగా, మెగా బ్రదర్ నాగబాబు నిర్మాణ భాగస్వామిగా వ్యవహరిస్తున్నాడు. ఇక ఏ ఇద్దరు కలిసిన ఈ చిత్రం గురించే మాట్లాడుకుంటున్నారు. వక్కంతం వంశీలో కృషి, పట్టుదలతో పాటు డైరెక్టర్‌కి కావాల్సిన అర్హతలన్నీ ఉన్నాయని, ఆయన కొరటాల శివలాగా తయారవుతాడని పలువురు ఆయన్ను పొగడ్తలతో ముంచేస్తున్నారు. ఇక తాను రైటర్‌గా ఉన్నప్పుడు ఆయక కాస్త బొద్దుగా, నీట్ షేవింగ్‌తో కనిపించేవాడు. కానీ ఈ చిత్రం ఆన్‌లోకేషన్స్‌లో మాత్రం ఆయన కాస్త బరువు తగ్గి, గెడ్డం పెంచుకుని డిఫరెంట్‌గా కనిపిస్తున్నాడు. ఈ చిత్రం ద్వారా లగడపాటి బేనర్ పెద్ద బేనర్ల జాబితాలో చేరడం ఖాయమని అంటున్నారు. ఇక ఈచిత్రానికి బాలీవుడ్ ద్వయం విశాల్-శేఖర్‌లు సంగీతం అందిస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రం కోసం మరీ ప్రత్యేకంగా అల్లుఅర్జున్ ఓ ప్రత్యేకమైన ట్రైనర్‌ని తీసుకుని, తన ఫిజిక్‌ని మిలటరీ జవాన్ల తరహాలో తయారు చేస్తూ ఆ పాత్రలో ఎలాగైనా లీనమైపోయి నటించాలనే పట్టుదలతో ఉన్నాడు.
ఇక తెలుగులో మిలట్రీ బ్యాక్‌డ్రాప్ చిత్రాలు చాలా తక్కువనే చెప్పాలి. ఎప్పుడో 'బొబ్బిలిపులి' వంటి చిత్రాలు అడపాదడపా వస్తుంటాయి. కమర్షియల్ చిత్రాలకు తగిన భావోద్వేగాలు, సెంటిమెంట్, లవ్, ఫ్యామిలీ ఎమోషన్స్ ని చూపించడానికి నిజంగా మిలట్రీ నేపధ్యం ఉన్న చిత్రాలు బాగా సూటవుతాయి. కానీ చిరంజీవి 'యుద్దభూమి' చిత్రం సరిగా ఆడలేదు. సో.. ఈ చిత్రంతో అల్లుఅర్జున్ ఎలాంటి ఫలితం సాధిస్తాడు అనేది ఎంతో ఆసక్తిని రేపుతోంది.