పవన్ కళ్యాణ్‌కి తెలుగులో ఓ సపరేట్ ఇమేజ్ ఉంది. జయాపజయాలకు అతీతంగా ఆయన చిత్రాలు అద్భుతమైన కలెక్షన్లు సాధిస్తాయి. మిగిలిన స్టార్స్ చిత్రాలు బాగా లేదంటే ఖాళీగా ఉండే థియేటర్లు పవన్ సినిమా బాగా లేకపోయినా ఓపెనింగ్స్‌ని అదరగొట్టేస్తాయి. మొదటి వారం కలెక్షన్లే 50కోట్లును దాటుతాయి. మొదటి వారం టిక్కెట్లు అంటే అసలు దొరకవు. సినిమా ఎలా ఉన్నా ఒకసారి చూద్దాం అని భావించే ప్రేక్షకులు ఆయనకు ఉన్నారు. 'సర్దార్‌గబ్బర్‌సింగ్, కాటమరాయుడు' వంటి రెండు చిత్రాల విషయంలో ఇది నిరూపితమైంది.
ఇక పవన్ కేవలం తన నటనతోనే కాదు.... తన ఐడియాలజీ, తనదైన వ్యక్తిక్త్తత్వంతో కూడా ఎందరో ప్రేక్షకులను సంపాదించి పెట్టుకున్నాడు. ఇక ఆయన రాజకీయ కార్యక్రమాలను కూడా చూసి ఆయనకు ఫ్యాన్‌గా అయిన వారు ఎందరో ఉన్నారు. కాగా ప్రస్తుతం పవన్ తన 25వ చిత్రాన్ని త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో హారిక అండ్ హాసిని బేనర్‌పై రాధాకృష్ణ నిర్మాతగా చిత్రం చేస్తున్నాడు. ఇందులో కీర్తి సురేష్, అను ఇమ్మాన్యియేల్‌లు కలిసి నటిస్తున్నారు. ఈ చిత్రం దసరాకి అనుకున్నా కూడా వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా ఎలాంటి టెన్షన్లు లేకుండా విడుదల చేయాలని భావిస్తున్నారు. ఇక ఈ చిత్రం షూటింగ్ మాత్రం అక్టోబర్ నాటికే దాదాపు పూర్తి చేసుకోనుంది.
ఇక ఈ చిత్రంలో పవన్ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా చేస్తున్నాడని వార్తలు వస్తున్నాయి. ఈ చిత్రం ద్వారా ప్రముఖ కోలీవుడ్ సంగీత సంచలనం అనిరుద్ మ్యూజిక్ డైరెక్టర్‌గా పరిచయం అవుతున్నాడు. మరోవైపు సెప్టెంబర్ 2వ తేదీన పవన్‌కళ్యాణ్ పుట్టినరోజు. ఆ సందర్బంగా పవన్ నటించే చిత్రం టైటిల్‌ని, ఫస్ట్‌లుక్‌ని విడుదల చేస్తారని వార్తలు వస్తున్నాయి. ఇక సోషల్ మీడియాలో పవన్ - త్రివిక్రమ్ కాంబినేషన్‌లో వచ్చే చిత్రం టైటిల్ ఇదేనంటూ పలు టైటిల్స్ ప్రచారంలో ఉన్నాయి.
'ఇంజనీరింగ్ బాబు, గోకుల కృష్ణుడు, దేవుడే దిగి వచ్చినా' అనే టైటిల్స్ ఇప్పటివరకు ప్రచారంలో ఉన్నాయి. ఈమద్య 'చుట్టేద్దాం.. రారండోయ్' అనే టైటిల్ కూడా వార్తల్లోకి వచ్చింది. తాజాగా ఈ చిత్రానికి 'రాజు ఒచ్చినాడు' అనే టైటిల్ వినిపిస్తోంది. గతంలో 'అత్తారింటికి దారేది' సమయంలో కూడా 'చిన్నల్లుడా.. మజాకా'వంటి టైటిల్స్ ప్రచారంలోకి వచ్చినా, చివరకు ఎవ్వరూ ఊహించని విధంగా 'అత్తారింటికి దారేది' అనే టైటిల్‌ని పెట్టారు. మరి ఈ నూతన చిత్రం విషయంలో త్రివిక్రమ్ శ్రీనివాస్ - పవన్- రాధాకృష్ణల మదిలో ఏముందో చూడాల్సివుంది...!