గత శుక్రవారం లాంగ్ వీకెండ్ ని క్యాష్ చేసుకోవడానికి ఒకరు మీద ఒకరు పోటీకి దిగిపోయి ఏకంగా మూడు సినిమాలని ప్రేక్షకుల మీదకి వదిలేసి మరీ .... మిక్స్డ్ టాక్ తో థియేటర్స్ లో దూసుకుపోతున్నారు. 'నేనే రాజు నేనే మంత్రి, జయ జానకి నాయక, లై' చిత్రాలు వీకెండ్ తో పాటు, కృష్ణాష్టమి, స్వాతంత్య దినోత్సవాలను క్యాష్ చేసుకోవాలనే తహ తహతో వచ్చేశాయి. మరి వారి నమ్మకాలను ప్రేక్షకులు కూడా బాగానే నిలబెట్టారు. మూడు సినిమాల్లో రానా నటించిన 'నేనే రాజు నేనే మంత్రి' టాప్ ప్లేస్ లో కొనసాగుతుంటే, బెల్లంకొండ సాయి శ్రీనివాస్ నటించిన 'జయ జానకి నాయక' సెకండ్ ప్లేస్ లోకొచ్చింది. ఇక నితిన్ హీరోగా నటించిన 'లై' చిత్రం మాత్రం కొత్త కాన్సెప్ట్ తో తెరకెక్కి రేస్ లో మూడో ప్లేస్ కి వెళ్ళిపోయింది. మరి మూడు సినిమాలు మూడు రకాల సబ్జక్ట్స్ తో తెరకెక్కి అన్ని వర్గాల ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుని నిలబడ్డాయి.
కానీ బుధవారం నుండి వీరి అసలు రంగు బయటపడబోతుంది. ఎలా అంటే వారు అనుకున్న నాలుగు రోజుల సెలవులు ముగిసి ఇప్పుడు వీక్ లో ఆఫీసులు, స్కూల్స్ అన్ని స్టార్ట్ అవడంతో... ఈ వర్కింగ్ డేస్ ఇప్పుడు సినిమాల కలెక్షన్స్ మీద ప్రభావం పడే అవకాశం ఎక్కువగా వుంది. ఈ వర్కింగ్ డేస్ లో మూడు సినిమాలు తమ సత్తా ఎంతవరకు చాటుతాయో అనేది ఇప్పుడు ఇంట్రెస్టింగ్ గా మారింది. ఈ వర్కింగ్ డేస్ లోనే ఏ సినిమా థియేటర్స్ లో ఎక్కువ కలెక్షన్స్ సాధించి హిట్ అనిపించుకుంటుందో చూడాలి. మరి వీక్ హీరో గా రానా, బెల్లంకొండ శ్రీనివాస్, నితిన్ లో ఎవరవుతారో వెయిట్ అండ్ సి.
అసలు ఈ మూడు చిత్రాలు వారానికొకటి దిగినట్టయితే తాము పెట్టిన పెట్టుబడి వెనక్కి తెచ్చుకోవడమే కాదు. ఇంకా లాభాలు జేబులో వేసుకునేవి కూడా. ఎందుకంటే మూడు సినిమాలు... మూడు బలమున్న కథలతో తెరకెక్కినవే కావడం... విడుదలైన ప్రతి చోట కాస్త పాజిటివ్ టాక్ తో దూసుకుపోవడం వంటివి చూస్తుంటే మాత్రం ఈ 'లై, నేనే రాజు నేనే మంత్రి, జయ జానకి నాయక' చిత్రాలు సోలోగా హిట్ కొట్టేసి సూపర్ కలెక్షన్స్ తో దూసుకుపోయేవి. కానీ మూడు పనిగట్టుకుని ఒకేసారి దిగేసరికి ప్రేక్షకులు కూడా ఎన్నని చూస్తారు. అందుకే వారు కూడా ఏ సినిమా చూడాలో తెలియక కన్ఫ్యూజ్ అవడంతో ఈ చిత్రాల కలెక్షన్స్ మీద ఆ ప్రభావం పడిందన్నమాట.