నేటి దర్శకులు కూడా యమా ఫాస్ట్‌గా ఉంటున్నారు. దర్శకులుగా మంచి టచ్‌లో ఉన్నప్పుడే తమ ఫ్యూచర్‌ని కూడా ప్లాన్ చేసుకుంటున్నారు. ఇక పూరీ సోదరుడు వైసీపీ తరపున పోటీ చేస్తాడని, వినాయక్ తండ్రి రాజకీయాలలోకి వస్తాడని, ఆయన సోదరుడు ప్రజారాజ్యం పార్టీ తరపున పోటీ చేస్తాడని గతంలో ఎన్నో వార్తలు వచ్చాయి. ఇక ఇప్పుడు ఏకంగా వినాయకే రాజకీయాలలోకి వచ్చే ఎన్నికల్లో నిలబడేందుకు సిద్దమవుతున్నాడనే వార్తలు ఫిల్మ్‌నగర్‌లో హల్ చల్ చేస్తున్నాయి.
ఇక తన సామాజిక వర్గానికి పెద్ద పీట వేసే పార్టీ తరపునే ఆయన నిలబడతాడంటూ ప్రచారం మొదలైంది. ఇక పవన్ కళ్యాణ్ తన జనసేన తరపున కులాలకు ప్రాధాన్యం ఇచ్చే పరిస్థితి లేదు. అందునా ఆయన మార్పు కోసమే రాజకీయాలు అంటున్నాడు గానీ రాజకీయంగా అధికారంలోకి రావడం కోసమే రాజకీయాలు అనేది తన పద్దతి కాదని తేల్చేశాడు. ఇక ఆయన ఎదుట ఉన్నవి రెండే రెండు ప్రత్యామ్నయాలు. ఒకటి టిడిపి, రెండు వైసీపీ.
తన సొంత నియోజకవర్గంలో టిడిపి బలం బాగానే ఉన్నా టిడిపిలో పోటీ చాలా తీవ్రంగా ఉంది. అలాంటి పరిస్థితుల్లో ఆయన వైసీపీ నుంచే పోటీ చేస్తాడని, ఇక కాంగ్రెస్, బిజెపిలకు ఎలాంటి ప్రజాదరణ లేకపోవడంతో ఆయన చూపు వైసీపీ వైపే ఉంది. ఇక ప్రభాస్‌తో 'యోగి' చిత్రం డైరెక్షన్ చేసే క్రమంలో ఆయనకు షర్మిలా, జగన్, రవీంద్రనాథ్‌రెడ్డి వంటి వైసీపీ నాయకులు, వైఎస్ రాజశేఖర్‌రెడ్డి బంధువులతో మంచి టచ్చేసే ఉన్నాయి. దీంతో ఆయన తాజాగా తన సన్నిహితులతో రాజకీయాల విషయమై ప్రస్తావన వచ్చినప్పుడు దేవుడు దయ తలిస్తే అలాగే అన్నాడట. ఇది ప్రస్తుతం అంతటా వైరల్ అవుతోంది.
అయితే వినాయక్ పొలిటికల్ ఎంట్రీ త్వరలోనే ఉండబోతుంది అనే వార్త బయటికి వచ్చినప్పటి నుండి..ఆయన అభిమానులు మాత్రం నిరాశను వ్యక్తం చేస్తున్నారు. వినాయక్ నుండి మేము సుమోలను లేపడం, హీరోలతో ఖద్దరు చొక్కాలేపించి, మీసాలకు సంపంగినూనె పూయించడం ఇష్టపడతాం కానీ..ఆయనే ఖద్దరు చొక్కా వేసుకుని, తన కారు వెనుక పది సుమోలు వేసుకుని తిరుగుతానంటే మాత్రం తట్టుకోలేం అని..వినాయక్ పై అభిమానాన్ని చాటుకుంటున్నారు.