ఎన్నికలకు చాలా కాలమే ఉన్నా దేశంలో అన్ని చోట్లా పొలిటికల్ ఫీవర్ పెరిగిపోతోంది. ఒకవైపు జనసేనాధిపతి పవన్‌కళ్యాణ్, మరోవైపు తమిళనాడు రజనీకాంత్, కమల్‌హాసన్, కన్నడ నాట ఉపేంద్రలు రాజకీయాలకు సై అంటున్నారు. అదే సమయంలో ఎంతోకాలంగా రాజకీయాలలో బిజీగా ఉంటున్న మా అధ్యక్షుడు శివాజీరాజా తాను ఇక రాజకీయాలలో యాక్టివ్ కానున్నానని, ఇప్పటికే బిజెపి తరపున తనకు పోటీ చేసే ఆఫర్ ఉందని తెలియజేశాడు. తాను ఆంధ్రాలో పెరిగింది 15ఏళ్లు మాత్రమేనని, మిగతా జీవితమంతా హైదరాబాద్‌లోనే గడిపానని అంత మాత్రాన టీఆర్‌ఎస్‌లో చేరనని స్పష్టం చేశాడు.
నీతి, నిజాయితీ, ఓపెన్‌గా మాట్లాడటం రాజకీయాలకు తగవని చెబుతుంటారని, కానీ తన జీవితంలో తాను మా అధ్యక్షుడిని కావడానికి అవే ఉపయోగపడ్డాయి కాబట్టి తాను వాటిని వదలబోనని తేల్చేశాడు. కృష్ణంరాజు రాజకీయాలలో ఉన్నరోజుల నుంచే తాను బిజెపిలో ఉన్నానని, రామానాయుడు తరపున ప్రచారం కూడా చేశానని గుర్తుచేశారు.
ఇక ఇటీవల 'ఫిదా' చిత్రం చూసిన తెలంగాణ సీఎం కేసీఆర్ వచ్చే ఎన్నికల్లో దిల్‌రాజుకి రెడ్డి కులం బలం, నిజామాబాద్‌లో ఉన్న పట్టు చూసి వచ్చే ఎన్నికల్లో ఎంపీగా సీటిస్తానని చెప్పినట్లు దానికి దిల్‌రాజు కూడా సానుకూలత వ్యక్తం చేసినట్లు సమాచారం.
మరోవైపు కోలీవుడ్‌లో పాపులర్ అయిన తెలుగు అమ్మాయి అయిన అంజలి సైతం ఇటీవల ఢిల్లీ వెళ్లి పార్లమెంట్‌ను సందర్శించింది. ఆ సందర్భంగా ఆమె ఓ పార్టీకి సంబంధించిన నాయకులతో మాట్లాడిందని సమాచారం. అనంతరం తనకు రాజకీయాలంటే ఎంతో ఇష్టమని, వాటిని ఎప్పుడు రెగ్యులర్‌గా ఫాలో అవుతుంటానని చెప్పింది.
మొత్తం మీద వచ్చే ఎన్నికలలో ఏపీ నుంచి ఏదో ఒక పార్టీ తరపున అంజలి, హేమ వంటి నటీమణులు కూడా ఎన్నికలలో పోటీ చేయడానికి రెడీ అవుతున్నారు. హీరో శివాజీ సైతం గుంటూరు జిల్లా నుంచి ఎంపీగా జనసేన తరపున పోటీ చేస్తాడని వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే.