మూడు బడా సినిమాలు ఆగష్టు 11 శుక్రవారం నువ్వా నేనా అని పోటీపడ్డ విషయం తెలిసిందే. ఆ పోటీలో ముగ్గురు సక్సెస్ అయినట్లే కనబడుతున్నారు. కానీ మూడు సినిమాలు ఒకేసారి థియేటర్స్ లోకి రావడంతో ప్రేక్షకులైతే హ్యాపీగా ఫీల్ అయ్యారు గాని... నిర్మాతలు మాత్రం కలెక్షన్స్ విషయంలో పడ్డ టెన్షన్ ఉంది చూడండి... అది మాత్రం వర్ణనాతీతం. ముగ్గురు హీరోలు తమ తమ సినిమాల మీద నమ్మకంతో ఒకరి మీద ఒకరు పోటీకి దిగేశారు. ఇకపోతే 'లై, నేనే రాజు నేనే మంత్రి, జయ జానకి నాయక' మూడు సినిమాలు మిక్స్డ్ టాక్ తెచ్చుకుని దిగిన థియేటర్స్ లో బాగానే సందడి చేస్తున్నాయి. మూడు సినిమాలు మూడు డిఫరెంట్ సబ్జక్ట్స్ కావడంతో మూడు సినిమాలకు మంచి టాకే వచ్చింది.
మరి మూడు సినిమాల కలెక్షన్స్ విషయంలో అసలే టెన్షన్ పడుతున్న నిర్మాతలకు నెత్తిన పిడుగు పడే సంఘటన మరొకటి జరిగింది. అదేమిటంటే విడుదలైన నెక్స్ట్ డే నే 'నేనే రాజు నేనే మంత్రి, లై, జయ జానకి నాయక' మూడు చిత్రాలు నెట్ లో ప్రత్యక్షమయ్యాయి. అసలే కలెక్షన్స్ విషయంలో ఉసూరు మంటున్న నిర్మాతలకు ఈ వార్త పిడుగులాంటిదే. పెట్టిన పెట్టుబడి రాబట్టుకోవాలని తాపత్రయంలో నిర్మాతలు కిందామీదా పడుతుంటే, ఇక్కడ పైరసీ రాయుళ్లు మాత్రం సినిమాలను థియేటర్స్ లో కెమెరాలో వీడియో తీసేసి నెట్లో పెట్టేశారు. యూట్యూబ్ లో మూడు సినిమాలు ఘోరాతి ఘోరంగా అప్ లోడ్ చేసి పైరసీ రాయుళ్లు తమ పని ఇదేనని నిరూపించుకున్నారు.
మరి వారు తీసిన సినిమా వీడియోస్ ప్రింట్స్ ఏమాత్రం గొప్పగా లేకున్నా స్మార్ట్ ఫోన్స్ లో మాత్రం పూర్తి క్లారిటీతో ప్రింట్స్ వచ్చేస్తున్నాయి. మరి ఇప్పుడు కేవలం కంప్యూటర్స్ లో మాత్రమే సినిమాలు చూడక్కర్లేదు. ప్రతి ఒక్కళ్ళ చేతులో ఉన్న స్మార్ట్ ఫోన్ లో నెట్ ఉంటే చాలు. అందులో ఈజీగా సినిమా చూసేయ్యొచ్చు. మరి సినిమా విడుదలైన 24 గంటల్లోనే ఇలా సినిమాలు నెట్ లో ప్రత్యక్షమైతే ఇక నిర్మాతల చేతికి చిప్ప తప్ప మిగిలేదేమిటి? సో..ప్రేక్షకులారా.. పైరసీని ప్రోత్సహించకండి. మీ కుటుంబాలతో థియేటర్స్ లోకి వెళ్లి మాత్రమే సినిమా చూడండి..! నిర్మాతను బ్రతికించండి. మరో మంచి సినిమాకి మార్గం వేయండి.