సినిమా మేకర్స్‌కి, రివ్యూ రైటర్స్‌కి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది. తెలుగులోనే కాదు.. తమిళం, హిందీ భాషల్లో కూడా ఇదే పరిస్థితి. అసలు రివ్యూలు తమ చిత్రంపై ఏ ప్రభావం చూపవని, రివ్యూలను చూసి ప్రేక్షకులు థియేటర్లకు వెళ్లరని చెబుతూనే మరోవంక రివ్యూ రైటర్లపై పంచ్‌లు, సెటైర్లు విసరడంలో ఫిల్మ్‌మేకర్స్ ముందుంటున్నారు. 'ఫిదా'వంటి మంచి చిత్రానికి బాగా మంచి రివ్యూలు ఇస్తే మాట్లాడని ఈ సోకాల్డ్ మేకర్స్ తమ చిత్రం రివ్యూలు సరిగా లేకపోతే మాత్రం సినిమాలను అర్ధం చేసుకోవడం రాదని, మండిపడుతుండటం ఖాయంగా ప్రతి చిత్రం విషయంలోనూ తెలుస్తూనే ఉంది.
ఇక నిన్నటి 'డిజె' పై వచ్చిన రివ్యూలపై దర్శకుదు హరీష్‌శంకర్, దిల్‌రాజు, అల్లుఅర్జున్‌లు చాలా ఘాటుగా రియాక్ట్ అయ్యారు. కానీ ప్రేక్షకులు ఇవ్వాల్సిన తీర్పునే ఇచ్చారు. ఇక్కడ సినీ మేకర్స్ చెప్పే విషయాలపై ప్రేక్షకులు ఎంతగా నమ్మకంగా ఉంటారో, మరో వర్గంలో రివ్యూ రేటింగ్స్‌పై కూడా థియేటర్లకు వెళ్లే ప్రేక్షకుల శాతం కూడా క్రమంగా పెరుగుతోందని 'డిజె' ఓవర్‌సీస్‌లో సాధించిన ఫలితాన్ని బట్టి అర్ధమవుతూనే ఉంది.
ఇక తాజాగా దగ్గుబాటి రానా హీరోగా తేజ దర్శకత్వంలో సురేష్‌బాబు నిర్మాతగా వచ్చిన 'నేనే రాజు నేనే మంత్రి' చిత్రానికి మిక్స్‌డ్ రెస్పాన్స్ వచ్చింది. ఈ చిత్రం ఫస్టాఫ్ బాగుందని, సెకండాఫ్‌లో గ్రాఫ్ పడిపోయిందని రివ్యూలు వచ్చాయి. కానీ తేజ ఏ దృష్టితో ఆ పాత్రను అలా మలిచాడో మాత్రం ఆయన మనసులోని భావాలను రివ్యూ రైటర్ బయటపెట్టలేడు. ఇక తేజ ఇప్పుడు రివ్యూ రైటర్స్‌పై పంచ్‌లు వేసే బాధ్యతను తన భుజాల మీదకి ఎత్తుకున్నాడు. సినిమాలో ఫస్ట్ హాఫ్‌లో హీరో క్యారెక్టర్ బాగా ఎలివేట్ అయి సెకండాఫ్‌లో అతని క్యారెక్టర్ పతనం అవుతుందని, దానిని చాలా మంది రివ్యూ రైటర్స్ కనిపెట్టలేక సెకండాఫ్ డౌన్ అయిందని రాశారని అన్నాడు.
ఇక నాడు చాలామంది మంచి రివ్యూ రైటర్స్ ఉండేవారని, కానీ నేడు అలాంటి వారు తక్కువగా ఉన్నారని, కానీ కొందరు మాత్రం తాను ఏవిధంగా ఆ క్యారెక్టర్ పతనమైందనే విషయాన్ని చూపించిన విధానాన్ని పసిగట్టారన్నాడు. మరికొందరు దానిలో విఫలయ్యారని సెటైర్లు వేశాడు. యూఎస్‌లో మొదటి షో తర్వాత మిక్స్‌డ్ రెస్సాన్స్ వచ్చిందని, కానీ ఫస్ట్‌షోని తాను శాంతి థియేటర్‌లో చూసిన తర్వాత చిత్రం హిట్టయిందని ఫిక్స్ అయ్యానని, మొదటి షో చూసేవారు ధర్మామీటర్లు, పారా మీటర్లు తీసుకుని వచ్చి సినిమాను పొడుద్దామని వస్తారని, ఆ షో టాక్‌ని పట్టించుకోవాల్సిన అవసరం లేదని, కానీ ఒరిజినల్ ప్రేక్షకులు మాత్రం ఫస్ట్ షోకే వస్తారని, వారిదే నిజమైన తీర్పుగా భావించాలని తీర్పునిచ్చేశాడు. మరి ప్రేక్షకులు ఏతీర్పు ఇస్తారో ఈ లాంగ్ వీకెండ్ ముగిసిన తర్వాత ఎలాగూ తెలుస్తుంది కదా.. తేజా గారు....!