యంగ్ రెబెల్‌స్టార్ కెరీర్ విషయానికి వస్తే 'బాహుబలి' ముందు, తర్వాత అని విభజించుకోవాలి. 'బాహుబలి' చిత్రానికి ముందు ప్రభాస్ కేవలం తెలుగులోనే యంగ్ స్టార్. కేవలం తెలుగులోనే యంగ్ రెబెల్‌స్టార్ ఇమేజ్‌ని పొందాడు. కానీ 'బాహుబలి' తర్వాత ప్రభాస్ టాలీవుడ్, కోలీవుడ్, మాలీవుడ్, శాండల్‌వుడ్‌తో సహా అన్ని వుడ్‌లలో, చివరికి బాలీవుడ్‌లో కూడా ఒక్కసారిగా స్టార్ హోదా తెచ్చుకున్నాడు. ఇలా దేశ వ్యాప్తంగానే గాక ఆయన విదేశాలలో కూడా పాపులారిటీ తెచ్చుకున్నాడు.
'బాహుబలి'లో భళ్లాలదేవగా గుర్తింపు పొందిన దగ్గుబాటి రానా 'బాహుబలి1' తర్వాత 'ఘాజీ'తో పాటు 'బాహుబలి-ది కన్‌క్లూజన్' చేశాడు. వీటి తర్వాత మరో ఇద్దరు హీరోల చిత్రాల పోటీని సైతం ఎదుర్కొని తాజాగా విడుదలైన 'నేనే రాజు నేనే మంత్రి' చిత్రం ద్వారా మొదటి రోజు నితిన్, బోయపాటి చిత్రాల కంటే ఎక్కువ కలెక్షన్లు సాధించడం కేవలం 'బాహుబలి' వల్ల వచ్చిన క్రేజ్‌తోనే సాధ్యమైందని చెప్పవచ్చు. ఇక రానా పరిస్థితే ఇలా ఉంటే ఇక తదుపరి ప్రభాస్ నటించబోయే చిత్రంపై అంచనాలు ఏ స్థాయిలో ఉంటాయో ఊహించవచ్చు.
ప్రస్తుతం ప్రభాస్ యువి క్రియేషన్స్ బేనర్‌లో 'రన్ రాజా రన్' ఫేమ్ సుజీత్ దర్శకత్వంలో 'సాహో' చిత్రం చేస్తున్నాడు. ఈ చిత్రంలో విలన్ల ఎంపిక కూడా పూర్తై షూటింగ్ మొదలుపెట్టి నెల దాటినా ఇప్పటికీ ఈ చిత్రంలో నటించబోయే హీరోయిన్ విషయంలో క్లారిటీ రాలేదు. డేట్స్ ప్రాబ్లమ్ వలన తర్జనభర్జనలు పడుతున్నబాలీవుడ్ హీరోయిన్ శ్రద్దా కపూర్ మాత్రం ఈ చిత్రం మిస్ చేసుకోకూడదనే నిర్ణయంతో ఉన్నట్లు తెలుస్తోంది.
ఇక 'బాహుబలి' చిత్రం ఆన్‌లైన్ హక్కులను నెట్‌ఫ్లిక్స్ సంస్థ ఏకంగా 4 మిలియన్ యూఎస్ డాలర్లకు తీసుకుంది. ఇక తాజాగా ఇదే సంస్థ ఆన్‌లైన్ హక్కులను 'సాహో' చిత్రానికి ఏకంగా 50కోట్లు వెచ్చించి సొంతం చేసుకుందని సమాచారం. తెలుగు, తమిళం , హిందీ, మలయాళం భాషల్లో రిలీజ్ కానున్న ఈచిత్రానికి బడ్జెట్‌ని 150కోట్లుగా నిర్ణయించగా, అందులో ఏకంగా 50కోట్లు ఆన్‌లైన్ హక్కుల ద్వారా నెట్‌ఫ్లిక్స్ సంస్థ నుండే రావడం విశేషంగా చెప్పుకోవాల్సివుంది....!