దేశంలోనే కులుమనాలి, కాశ్మీర్, అమర్‌నాథ్, గోవా, ఊటీ, కొడైకెనాల్, హార్సిలీ హిల్స్, పొలాచ్చి, ఉభయగోదావరి వంటి ఎన్నో ప్రాంతాలలో ముఖ్యంగా అరకు, లంబసింగి.. వంటి ఎన్నో అందమైన లోకేషన్లు ఉన్నాయి. కానీ మన స్టార్స్ మాత్రం పాటలకు విదేశాలకు వెళ్లడమో లేక భారీసెట్స్ వేయడమో చేస్తుంటారు. ఇక యూరప్ దేశాలైతే తమ దేశంలోని అందమైన లోకేషన్లలో షూటింగ్ చేసి వాటిని ప్రాచుర్యం కలిపిస్తే ఎన్నో రాయితీలు ఇస్తున్నాయి. దీంతో మన స్టార్స్ అందరూ సింగపూర్, మలేషియా, హాంకాంగ్, దుబాయ్, పోర్చుగల్, రుమేనియా, బల్గేరియా, యూఎస్ వంటి దేశాలకు వెళ్తున్నారు.
కానీ తెలంగాణలోని బాన్సువాడ, బోధన్ ప్రాంతాలను తన 'ఫిదా' చిత్రంలో శేఖర్‌కమ్ముల ఎంతో అందంగా చూపించాడు. ఇక తాజాగా విడుదలైన బోయపాటి శ్రీను దర్శకత్వంలో రకుల్‌ప్రీత్‌సింగ్, ప్రగ్యాజైస్వాల్, క్యాధరిన్‌లు నటించగా, మిర్యాల రవీందర్‌రెడ్డి నిర్మించిన 'జయ జానకి నాయక'లో కృష్ణాజిల్లాలోని కృష్ణానది బంగాళాఖాతంలో కలిసే హంసలదీవిని అద్భుతంగా చూపించారు. ఈ హంసలదీవికి మన ప్రభుత్వాలు ఎలాంటి ప్రాచుర్యం కలిపించడం లేదు. ఎంత సేపటికి టూరిజాన్ని అభివృద్ది చేస్తున్నామని చెప్పుకునే ప్రభుత్వాల కంటే పాపికొండలు, కోనసీమ, గోదావరి అందాలకు మన పెద్ద వంశీనే తన చిత్రాల ద్వారా ప్రచారం కల్పించాడు.
తర్వాత 'గోదావరి' చిత్రంలో శేఖర్‌కమ్ముల పాపికొండల అందాలను అద్భుతంగా ఆవిష్కరించాడు. ఇక ఇప్పుడు బోయపాటి శ్రీను, సినిమాటోగ్రాఫర్ రిషి పంజాబీలు కలిసి హంసలదీవి అందాలను చక్కగా తెరకెక్కించారు. వీరి పుణ్యమా అని మన దేశంలోని, రాష్ట్రాలలోని అందమైన లోకేషన్లకు మంచి డిమాండ్ వచ్చే రోజులు త్వరలోనే వస్తాయని భావించవచ్చు.