2014 ఎన్నికలకు ముందు పవర్‌స్టార్ పవన్‌కళ్యాణ్ 'జనసేన' పార్టీని స్థాపించి, ఆ ఎన్నికలలో బిజెపికి-టిడిపిలకు మద్దతు ఇచ్చి, రాష్ట్రవ్యాప్తంగా మోడీ, చంద్రబాబులతో కలసి ప్రచారం చేశాడు. ఇక తాను రాజకీయ అధికారం కోసం రాలేదని, ప్రజల తరపున ప్రభుత్వాలను ప్రశ్నించడానికే తాను రాజకీయాలలోకి వచ్చినట్లు జనసేనాధిపతి చెబుతున్నారు. అలాగే ఆయన ఉద్దానం కిడ్నీ బాధితులు, పోలవరం, రాజధాని రైతుల, చేనేత కార్మికుల సమస్యలు, అగ్రిగోల్డ్ వంటి పలు సమస్యలపై స్పందిస్తున్నాడు.
ముఖ్యంగా ఏపీకి ప్రత్యేకహోదా విషయంలో ఆయన తన గళం వినిపిస్తున్నాడు. మరోవైపు తమిళనాడులో త్వరలో సూపర్‌స్టార్ రజనీకాంత్, లోకనాయకుడు కమల్‌హాసన్‌లు కూడా రాజకీయ అరంగేట్రం చేయనున్నారని వస్తున్న వార్తలతో తమిళనాడు రాజకీయాలలో వేడి రాజుకుంది. ఇక నటునిగా, నిర్మాతగా, దర్శకునిగా పేరున్న ప్రముఖ కన్నడ స్టార్ హీరో ఉపేంద్ర తాజాగా రాజకీయాలలోకి ఎంటర్ అయ్యాడు. తనదైన చిత్రాలతో ఆయన యూత్‌లో ఎంతో పాపులారిటీ సాధించుకున్నాడు. తనదైన మనోభావాలను, మహిళల విషయంలో ఆయన తన ఆలోచనా విధానాన్ని తన చిత్రాల ద్వారా చూపిస్తూనే తనదైన శైలిలో పేరు తెచ్చుకున్నాడు.
ఇక తాజాగా ఆయన పలు సార్లు పవన్ వేసుకున్నట్లుగానే ఈయన కూడా ఖాకీ దుస్తులతో రాజకీయాలలోకి వచ్చాడు. రాజకీయ నాయకులు వేసే ఖద్దరు దుస్తులు, తెల్లదుస్తులు తాను వేయనని, తాను కూడా ఓ కార్మికుడినే కాబట్టి ఖాకీ దుస్తులు ధరిస్తున్నానని చెప్పాడు. బిజెపి, జెడియస్, కాంగ్రెస్‌పార్టీల మీద తనకు కోపంలేదని ప్రజా సంక్షేమానికి తాను వారుతో కూడా కలిసి పనిచేస్తానన్నాడు. రాజకీయ పార్టీలు రాజకీయాలు చేస్తున్నాయే గానీ ప్రజాసమస్యలను పట్టించుకోవడం లేదని, కానీ తాను రాజకీయాలు చేయనని, కేవలం ప్రజాకీయాలు చేస్తానని ప్రకటించాడు.
రాజకీయం అనే పదం ప్రజా ప్రభుత్వాలకు సరిపోవడం లేదన్నాడు. అందరు మంచి వ్యక్తులను చేరదీసి ప్రజా సమస్యలపై దృష్టి కేంద్రీకరిస్తానని చెప్పాడు. ప్రజలలో చైతన్యం కలిగించేందుకు ఓ వేదికను ఏర్పాటు చేయదలుచుకున్నానని, కార్మికులు, పేదలు, రైతుల వల్లనే ఏర్పడిన ప్రభుత్వాలు వారికి మేలు చేయడంలేదన్నాడు. పార్టీ పెడితే డబ్బు కావాలి. దానికోసం ఫండ్స్ సేకరించాలి. గెలిస్తే మరలా అలా ఎవరి వద్ద నుంచి నిధులు తీసుకున్నామో వారికి మరలా సంపాదించే అవకాశం ఇవ్వాల్సివస్తుందని ఆవేదన వ్యక్తం చేశాడు. అంతిమంగా ప్రజలే నష్టపోతారని, తాను ప్రజల నుంచి సలహాలు, సూచనలు కోరుతున్నానని చెప్పాడు. మొత్తానికి ఉపేంద్ర పుణ్యమా అని కన్నడ రాజకీయాలు కూడా బాగా వేడెక్కాయి.