వెంకటేష్ తన తోటి సీనియర్ స్టార్స్ ఏడాదికి ఒకే సినిమా చేసే సమయంలో కూడా ఆయన ఏడాదికి రెండు మూడు చిత్రాలలో నటించాడు. ఇక ఆయన ఎప్పుడు ఏదో ఒక చిత్రం షూటింగ్‌లో నిర్విరామంగా ఉంటూనే ఉన్నాడు. కానీ 'గురు' చిత్రం తర్వాత మాత్రం వెంకటేష్ చాలా కాలంగా గ్యాప్ తీసుకున్నాడు. దాంతో ఆయన అభిమానులు అసంతృప్తితో ఉన్నారు. తాజా సమాచారం ప్రకారం వెంకటేష్ త్వరలో ఓ గ్రాఫిక్స్, విఎఫ్‌ఎక్స్ కు బాగా స్కోప్ ఉన్న జంగిల్ చిత్రంలో జంతువులతో సాగే కథలో నటించనున్నాడు. ఇటీవలే ఆయన అన్నయ్య సురేష్‌బాబు 'నేనే రాజు నేనే మంత్రి' ప్రమోషన్స్ సందర్భంగా ఈ విషయం చెప్పాడు.
గతంలో బి.గోపాల్ దర్శకత్వంలో వెంకటేష్, దివ్యభారతి, వాణిశ్రీలు నటించగా, సురేష్‌ప్రొడక్షన్ సంస్థలో నాడే ఎవ్వరూ చేయని విధంగా ఓ జంతువులతో కూడిన యానిమేషన్ సాంగ్‌లో వెంకీ నటించి ఉన్నాడు. ఇక ఈ జంగిల్ చిత్రానికి కొత్త దర్శకుడు డైరెక్ట్ చేయనున్నాడని, ఈస్టోరీ వెంకీకి విపరీతంగా నచ్చిందని వార్తలు వస్తున్నాయి. బాలకృష్ణ చేస్తున్న 'పైసా వసూల్' చిత్రం స్థానంలో పూరీ జగన్నాథ్.. వెంకటేష్‌తో చిత్రం చేయాలని అనుకున్నాడు. కానీ ఈ చిత్రం బడ్జెట్ తన మార్కెట్ పరిధి కంటే ఎక్కువ అయ్యే అవకాశాలు ఉండటంతో ఆయన సైడ్ అయ్యాడు. పూరీ మహేష్‌బాబుతో చేయాలని భావించిన దేశభక్తి చిత్రం 'జనగణమన' స్టోరీనే ఇప్పుడు వెంకీ చేయనున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రం బాలకృష్ణ -పూరీ జగన్నాథ్‌ల 'పైసా వసూల్' చిత్రం సెప్టెంబర్ 1న విడుదలైన తర్వాతనే ఆ ఫలితం చూసి సినిమాను అఫీషియల్‌గా అనౌన్స్ చేయాలని వెంకీ భావిస్తున్నాడట.
మరోవైపు తమిళంలో విక్రమ బేతాళ కథ ఆధారంగా సిన్సియర్ పోలీస్ ఆఫీసర్‌గా, ఎన్‌కౌంటర్ స్పెషలిస్ట్‌గా మాధవన్ నటించగా, విజయ్‌సేతుపతి గ్యాంగ్‌స్టర్‌గా నటించిన 'విక్రమ్‌వేద' చిత్రం రీమేక్ లో మాధవన్ పాత్రను వెంకటేష్, విజయ్ సేతుపతి నటించిన పాత్రను రానా పోషించే అవకాశం ఉందని, ప్రస్తుతం చర్చలు సాగుతున్నాయని 'విక్రమ్‌వేద' యూనిట్ ఆల్‌రెడీ చెప్పేసింది. ఇక ఈ చిత్రం తమిళ ఒరిజినల్‌గా దర్శకత్వం వహించిన దర్శకద్వయం, భార్యాభర్తలైన గాయత్రి-పుష్కర్‌ల డైరెక్షన్‌లోనే రూపొందే ఈ చిత్రంలో వెంకటేష్, రానాలు నటించడం ఖాయమైందని వార్తలు వచ్చాయి.
గతంలో వెంకటేష్.. గౌతమ్‌మీనన్ దర్శకత్వంలో వచ్చిన 'ఘర్షణ' చిత్రంలో పవర్‌ఫుల్ పోలీస్ పాత్రను వెంకటేష్ పోషించి, ప్రశంసలు అందుకున్న సంగతి తెలిసిందే. ఇక ఆయన 'సూపర్ పోలీస్'తో పాటు బాలీవుడ్ 'ది వెడ్నెస్‌డే'కి రీమేక్‌గా కమల్ హాసన్ నటించిన 'ఈనాడు' చిత్రంలో కూడా వెంకీ పవర్‌ఫుల్ ఐపీఎస్‌గా నటించించాడు. ఈ చిత్రానికి చక్రి తోలేటి దర్శకత్వం వహించాడు.