టాలీవుడ్ లో ఏదైనా సినిమా టీజర్ గాని, ట్రైలర్ గాని, సినిమా గాని విడుదలవుతుంది అంటే ఆ సినిమా పట్ల టాలీవుడ్ టాప్ డైరెక్టర్ రాజమౌళి స్పందన ఎలా ఉంటుంది అని అందరూ తెగ ఆసక్తిగా ఎదురు చూసే పరిస్థితిలో ఉన్నారు. ఎందుకంటే రాజమౌళికి ఆ సినిమా నచ్చింది అంటే ఆ సినిమా తిరుగులేని హిట్ కొట్టేసినట్లే. అందుకే రాజమౌళి ట్వీట్ కోసం అగ్ర హీరోలు కూడా ఎదురు చూసే పరిస్థితి. మొన్నటికి మొన్న ఎన్టీఆర్ 'జై' టీజర్ ని ఆకాశానికెత్తేసిన రాజమౌళి ఇప్పుడు రానా హీరోగా వచ్చిన నేనే రాజు నేనే మంత్రి కి కూడా సూపర్ ట్వీటేసాడు.
బాహుబలి సీరీస్ తో జాతీయ స్థాయిలో కీర్తి ప్రతిష్టలందుకుంటున్న ఈ డైరెక్టర్, తన భళ్లాలదేవుడు హీరోగా చేసిన 'నేనే రాజు నేనే మంత్రి' చిత్రాన్ని చూసి సినిమా సూపర్ అంటూ సోషల్ మీడియాలో తన స్పందనని తెలియజేశాడు. డైరెక్టర్ తేజ గారు నేనే రాజు నేనే మంత్రిని చాలా అద్భుతంగా తెరకెక్కించారు. ఈ చిత్రంలో ప్రతి ఒక్కరూ ఎంతో బాగా నటించారు. భల్లాలదేవుడు రానాని చూసి గర్వపడుతున్నా. కాజల్ కూడా చాలా బాగుంది. క్యాథరీన్ కూడా బాగుంది. నవదీప్ కూడా ఎంతో చక్కగా చేశాడు. సినిమా ఓపెనింగ్ సీక్వెన్సు.. క్లైమాక్స్ ట్విస్టు లు అదిరిపోయాయి.. చాలా రోజుల తరువాత ఒక అర్ధవంతమైన సినిమా వచ్చింది. సినిమా చూసి చాలా ఎంజాయ్ చేశానంటూ ఆకాశానికెత్తేశాడు.
ఈ సినిమాలో ఉన్న పొలిటికల్ డైలాగ్స్ తనకు నచ్చాయని రాజమౌళి ట్వీట్ చేసాడు. మరి రానా మీద అభిమానంతో ఇలా ట్వీట్ చేసాడో? లేకుంటే నిజంగానే రాజమౌళి ఆలోచనలకు ఈ సినిమా దగ్గరగా ఉండి....అంతగా నచ్చబట్టే ఇలాంటి ట్వీట్ చేసాడో? గాని ఇప్పుడు రాజమౌళి ట్వీట్ మాత్రం 'నేనే రాజు నేనే మంత్రి' సినిమా కలెక్షన్స్ కి హెల్ప్ అవుతుందని అంటున్నారు.