తెలుగులో మేధావులతో పాటు భయంకర మేధావులకి కూడా కొదువలేదు. అలా మేధస్సు శృతిమించిన దర్శకులు జాబితాలో పూరీజగన్నాథ్, కృష్ణవంశీ, గీతాకృష్ణ వంటి వారితో పాటు తేజను కూడా చెప్పుకోవచ్చు. తేజ అయితే పీక్స్‌లో ఉంటాడు. నటీనటులను కొడతానని, తన చేత దెబ్బలు తింటే స్టార్స్ కావడం ఖాయమని అంటుంటాడు. ఇక వర్మలాగా నా చిత్రాలు నా ఇష్టం అనే తత్వం ఆయనది. గతంలో వారసులే హీరోలు అవుతారా? ఓ రిక్షావాడి కొడుకుని స్టార్‌ని చేస్తానని శపధం చేశాడు. కానీ దాదాపు గత పుష్కరకాలంగా ఆయనకు సరైన హిట్ లేక ఫేడవుట్ అయ్యాడు. దాదాపు 'జై' చిత్రం నుండి ఆయనది అదే పరిస్థితి.
కాగా తేజ స్టార్ హీరో అయిన మహేష్‌బాబుతో తప్ప వేరే స్టార్‌తో చిత్రం చేయలేదు. అలా చేసిన చిత్రమే 'నిజం'. ఈ చిత్రం కమర్షియల్‌గా సక్సెస్ కాకపోయినా అవార్డులు, విమర్శకుల ప్రశంసలను మాత్రం పొందింది. వాస్తవానికి 'జై' చిత్రంతో ఆయన నవదీప్‌ని పరిచయం చేశాడు. ఇండియన్ బాక్సర్‌కి, లష్కర్ ఏ తోయిబా ఉగ్రవాది అయిన బాక్సర్‌కి మద్య జరిగే కథ. ఇక 'నిజం' చిత్రం అవినీతిపై ఎక్కు పెట్టిన అస్త్రం. కానీ తేజ క్యాస్టింగ్‌ని ఎంచుకోవడంలోనే పెద్ద తప్పు చేశాడు. అదే 'జై' చిత్రం మహేష్‌బాబు వంటి స్టార్‌తో, 'నిజం' చిత్రం కొత్తవాడైన నవదీప్‌లతో మార్చి తీసి ఉంటే ఈ రెండు హిట్లయ్యేవని నాడు పలువురు విశ్లేషించారు.
ఇక ఆ తర్వాత ఆయన చేసిన 'ఔనన్నా.. కాదన్నా, ధైర్యం, లక్ష్మీకళ్యాణం, నీకూ నాకు డ్యాష్ డాష్, ఒక విచిత్రం, కేక, హోరాహోరీ' ఇలా అన్ని సినిమాలు ఫ్లాప్ అయ్యాయి. ఎట్టకేలకు ఆయనకు రానాతో 'నేనే రాజు నేనే మంత్రి' అవకాశం లభించింది. ఈ చిత్రం గురించి ఎంతో గొప్పగా చెబుతున్న తేజ త్వరలో 'నిజం' చిత్రానికి సీక్వెల్ తీయడానికి రెడీ అవుతున్నాడట. స్టోరి కూడా సిద్దమైపోయిందని టాక్. ఈ చిత్రానికి 'ఇది నిజం కాదు' అనే టైటిల్‌ని అనుకుంటున్నాడని, మహేష్‌తో కాకుండా ఓ చిన్న హీరోతో ఈచిత్రం చేయాలని ఆయన భావిస్తున్నాడని అంటున్నారు.
అయినా 'నేనే రాజు నేనే మంత్రి' రిలీజ్ కాబట్టి వార్తల్లో ఉండటానికి ఇలాంటివి ఎన్నో చెబుతారు. గతంలో కూడా ఆయన ఫ్లాప్‌లలో ఉన్నప్పుడు రజనీకాంత్, కమల్‌హాసన్‌లు తనను డైరెక్షన్ చేయమని అడిగారని, తానే ఆలోచిస్తున్నానని చెప్పి నవ్వుల పాలయ్యాడు. ఇక ఈ లాంగ్ వీకెండ్ తర్వాత 'నేనే రాజు నేనే మంత్రి' పూర్తి రిజల్ట్ చూస్తేనే ఆయన ఈ 'ఇది నిజంకాదు' చేస్తాడా? లేదా? లేక ఇదంతా పబ్లిసిటీ గిమ్మిక్కా అనేది తెలుస్తుంది.