'ఏమాయ చేసావే' చిత్రంతో నాగచైతన్య, సమంతలిద్దరు ఒకరి మాయలో మరోకరు పడిపోయారు. ఇక వీరు తమ ప్రేమను దాచి దాచి చివరకు ఓ సస్పెన్స్ థ్రిల్లర్‌గా ఊరించి ఎట్టకేలకు తాము పెళ్లి చేసుకోబోతున్న మాట నిజమేనని ఒప్పుకున్నారు. ఇక తనకు చైతూకి మానసికంగా ఎప్పుడో పెళ్లై పోయిందని, కానీ వేడుకగా జరగాల్సిన పెళ్లి మాత్రమే మిగిలి ఉందని కూడా సమంత ఓపెన్‌గానే చెప్పేసింది. ఇక తమ ప్రేమను బయటపెట్టిన తర్వాత ఈ జంట ఎన్నో సందర్భాలలో క్లోజ్‌గా కనిపిస్తూ, బాగానే ఎంజాయ్ చేస్తున్నారు. వాటిని నాగచైతన్య బయటపెట్టకపోయినా సోషల్‌మీడియాలో యాక్టివ్‌గా ఉండే సమంత మాత్రం ఆ ఫొటోలను, వీడియోలను సోషల్‌మీడియాలో షేర్ చేస్తూనే ఉంది.
ఇక సమంత పెళ్లి రోజున కట్టుకోబోయేది నాగచైతన్య అమ్మమ్మ, వెంకటేష్ తల్లి, రామానాయుడు భార్య అయిన రాజేశ్వరిదని, దీనిని రీమోడల్ చేసి, బంగారు జరిని జోడిస్తున్నారని తాజాగా వార్తలు వినిపించాయి. మరోవైపు సమంత వేసుకోబోయే నగలపై కూడా పలు ఆసక్తికర వార్తలు వస్తున్నాయి. తాజాగా వీరి పెళ్లి శుభలేఖలు కూడా ముద్రితమయ్యాయి. వీరి పెళ్లి అందరూ అనుకుంటున్నట్లుగానే అక్టోబర్ 6, 7 తేదీలలో అంటే రెండు రోజులు జరగనుంది. ఒకరోజు సమంతకి నచ్చినట్లుగా ఆమె కుటుంబ సాంప్రదాయం ప్రకారం క్రిస్టియన్ పద్దతుల్లో చర్చిలో ఫాదర్ సమక్షంలో పెళ్లి జరగనుంది. మరో రోజున నాగచైతన్యకి చెందిన హిందూ సాంప్రదాయం ప్రకారం తాళి, సన్నాయిలు, పురోహితుల నడుమ జరగనుంది. ఈ పెళ్లిళ్లు గోవాలోని వగటర్ బీచ్ వద్ద ఉన్న డబ్ల్యు హోటల్లో అంగరంగ వైభవంగా జరగనున్నాయి.
ఈ వివాహ వేడుకకు కుటుంబసభ్యులతో పాటు అత్యంత సన్నిహితులు మాత్రమే హాజరుకానుండగా, తర్వాత హైదరాబాద్‌లో జరిగే భారీ రిసెప్షన్‌కి మాత్రం సినీ ప్రముఖులతో పాటు రాజకీయ ప్రముఖులను కూడా ఆహ్వానించనున్నారు.
అయితే ఇది ఫేక్ వెడ్డింగ్ కార్డు అని వినిపిస్తున్నప్పటికీ.. శుభలేఖ గా ముద్రణ వుంది కాబట్టి..రండి సమంత, చైతన్య ల పెళ్లి పత్రిక చూద్దాం..!