ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విడిపోయినా..తెలుగు సినిమా ఇండస్ట్రీ మాత్రం విడిపోలేదు. ఒక్కటిగానే ఉండి రెండు కళ్ళుగా ఏపీ, తెలంగాణని భావిస్తోంది టాలీవుడ్. కొందరు నిర్మాతలు తమ చిత్రాలని రెండు రాష్ట్రాల ప్రజలకీ చేరువ చేసేందుకు ఆయా చిత్రాలకి సంబంధించిన ఏదో ఒక ఫంక్షన్‌ని ఏపీలో ప్లాన్ చేసుకుంటున్నారు. మరి కొందరు మాత్రం హైద్రాబాద్‌ని వదిలి వెళ్లేది లేదని ఖరాఖండీగా చెప్పేస్తూ..వారి చిత్రాలకి సంబంధించిన అన్ని ఫంక్షన్‌లని ఇక్కడే కానిచ్చేస్తున్నారు.
అయితే ఈ విషయంలో మాత్రం తెలంగాణ వారైన దిల్‌రాజు, నితిన్‌ల రూటు మాత్రం వేరుగా ఉంది. దిల్ రాజు నిర్మాతగా శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వచ్చిన 'ఫిదా' చిత్రం రేపు రిలీజ్ అనే వరకు కూడా దిల్‌రాజు ఏపీలోని దేవుళ్ళని ప్రసన్నం చేసుకునే ప్రయత్నం చేశారు. ద్వారక తిరుమల, హనుమాన్ జంక్షన్ అంటూ ఏపీలోని పలు దేవాలయాలను తన టీమ్‌తో సందర్శించారు.
ఇప్పుడు తాజాగా నితిన్ కూడా తన చిత్రం 'లై' విడుదలకు ముందు తన టీమ్‌తో కలిసి తిరుమల తిరుపతిని సందర్శించి, మొక్కులు తీర్చుకున్నారు. ఆయన నిర్మాత, ఈయన హీరో అనే గానీ..ఇద్దరూ ఆయా సినిమాలకి మెయిన్ పాత్రలే. కాకపోతే..తెలంగాణని..సారీ..తెలంగాణ దేవుళ్ళని ప్రక్కనపెట్టి..ఏపీ దేవుళ్ళపై ఎందుకింత ప్రేమ చూపిస్తున్నారో..అనేదే అర్ధం కావడం లేదు.