ఇక సినిమాలలో నటించే కొన్ని పాత్రలు హీరోలకు వారి గోల్‌ని తెలియజేప్పే విధంగా ఉంటాయి. గతంలో 'ముఠామేస్త్రి'లో చిరంజీవి రాజకీయనాయకుడిగా కనిపించాడు. ఇక తనకు డాక్టరేట్ లేని లోటును నాడు ఆయన 'శంకర్‌దాదా ఎంబిబిఎస్'తో తీర్చుకున్నాడనే సెటైర్లు వినిపించాయి. కాగా ప్రస్తుతం దేశవ్యాప్తంగా రజనీకాంత్ పొలిటికల్ ఎంట్రీపై ఆసక్తికర చర్చ సాగుతోంది. తమిళంలో సినిమాకు రాజకీయాలకు విడదీయరాని బంధంతో పాటు ఎదురు తిరిగితే రాజకీయనాయకులు స్టార్స్‌ని సైతం ఇబ్బందులకు గురిచేస్తారని కమల్ 'విశ్వరూపం'తో అందరికీ అర్ధమైంది.
ఇక రజినీకాంత్ నాడు శంకర్ దర్శకత్వంలో అర్జున్ హీరోగా వచ్చిన 'ఒకే ఒక్కడు'లో నటించాల్సివుంది. కానీ అనవసర వివాదాలు ఎందుకని భావించిన ఆయన ఈ చిత్రంలో నటించలేదు. కానీ ఇప్పుడు రజనీ పొలిటికల్ అరంగేట్రంపై చర్చ సాగుతుండటం, రజనీ కాబోయే సీఎం అని ప్రచారం జరుగుతున్న నేపధ్యంలో ఆయన 'ఒకే ఒక్కడు' చిత్రం సీక్వెల్‌లో సీఎంగా కనిపించడానికి రెడీ అంటున్నాడు. ప్రస్తుతం '2.0' షూటింగ్ ముగించుకుని 'కాలా' మొదలుపెట్టిన రజనీ ఆ తర్వాత మరలా శంకర్ దర్శకత్వంలోనే 'ఒకే ఒక్కడు' సీక్వెల్‌లో నటించడానికి, దానిని తన పొలిటికల్ మైలేజ్‌కి ఉపయోగించుకోవడానికి సిద్దపడుతున్నాడని టాక్.
ఇటీవలే రాజమౌళి తండ్రి విజయేంద్రప్రసాద్ తాను ప్రస్తుతం శంకర్ కోసం 'ఒకే ఒక్కడు' సీక్వెల్‌ని రాస్తున్నానని చెప్పిన సంగతి తెలిసిందే. ఇక తాను రజనీతో తీస్తే ఆయన చెప్పే డైలాగ్‌లకు, ఆయన స్టైల్‌కి థియేటర్లు చప్పట్లు, ఈలలతో మార్మోగిపోయి వారం రోజుల పాటు డైలాగ్సే వినబడకుండా తీయాలని ఉందని రాజమౌళి చెప్పాడు. ఇప్పుడు అలాంటి కథనే విజయేంద్రప్రసాద్ రజనీ-శంకర్‌ల కోసం తయారు చేస్తుండటం విశేషం.