ఫ్యామిలీ హీరోగానే కాకుండా 'గాయం, సముద్రం, అంత:పురం' వంటి మాస్ చిత్రాలను కూడా చేసిన హీరో జగపతిబాబు. ఇక హీరోగా తన కెరీర్ అయిపోయిందని భావించి, నటన ఏదైనా ఒకటే కదా..? హీరో అయినా క్యారెక్టర్ ఆర్టిస్ట్, విలన్... ఇవన్నీ నటనకు ఆస్కారమిచ్చే పాత్రలే అయినప్పుడు ఏ పాత్ర చేస్తే ఏమిటి అని ఆలోచించాడు. 'లెజెండ్'లో విలన్‌గా, 'శ్రీమంతుడు'లో బిగ్ బిజినెస్ టైకూన్‌గా, మహేష్‌బాబుకు తండ్రి పాత్రను పోషించాడు.
కాగా ఈయనకు ఇప్పుడు తెలుగుతో పాటు తమిళ, మలయాళ చిత్రాల నుంచి కూడా ఆఫర్స్ వస్తున్నాయి. తాజాగా ఓ బాలీవుడ్ చిత్రం అంగీకరించానని, త్వరలో దాని గురించి చెబుతానన్నాడు. ఇక ఆయన లీడ్‌పాత్ర పోషించిన 'పటేల్‌సార్' సినిమా బాగా నిరాశపరిచింది. ఈ చిత్రం విడుదలకు ముందు మీడియా మరలా హీరోగా చేయడం అవసరమా? అని అడిగితే తనకు హీరోగా చేయాలనే జిలతో, అలాగే నిర్మాత సాయికొర్రపాటి డబ్బులు ఎక్కువై ఈ చిత్రం చేయలేదని, సినిమా సూపర్‌గా ఉంటుందని చెప్పాడు. ఇక ఆయన ఆశలు ఆవిరి అయ్యాయి. దాంతో ఈ చిత్రం విషయంలో తాము కొన్ని తప్పులు చేశామని, ఈ చిత్రం పోస్టర్స్, లుక్స్, టీజర్స్ వంటివి చూసి ప్రేక్షకులు ఇదో యాక్షన్, థ్రిల్లర్ మూవీ అని అంచనా వేశారని, కానీ తాము కుటుంబ కథను చూపించడంతో వారు నిరాశచెందారని చెప్పాడు.
ప్రేక్షకులు బిర్యాని కోసం వస్తే తాము కేవలం మామూలు అన్నం పెట్టామన్నాడు. ఇక ఈ చిత్రంలో సాయికొర్రపాటితో పాటు జగపతిబాబు కూడా పార్ట్‌నర్ అని, ఈచిత్రానికి ఆయన రెమ్యూనరేషన్ కూడా తీసుకోలేదని అంటున్నారు. జగ్గూబాయ్‌కి నిర్మాతగా కలిసి రాదని ఈ 'పటేల్‌సార్' మరోసారి నిరూపించింది.