బాలకృష్ణ - పూరి కాంబోలో తెరకెక్కిన 'పైసా వసూల్' చిత్రం రికార్డు టైం లో షూటింగ్ కంప్లీట్ చేసుకుని సెప్టెంబర్ 1 న విడుదలకు సిద్దమయ్యింది. ఎప్పుడో సెప్టెంబర్ చివరిలో విడుదల చేస్తామని ముందు అనౌన్స్ చేసినప్పటికీ రెండు పెద్ద సినిమాల (జై లవ కుశ, స్పైడర్) మధ్యలో యుద్ధం అవసరమా అనుకున్నారో ఏమోగానీ సెప్టెంబర్ 1 నే వచ్చేస్తున్నారు. పూరి జగన్నాధ్ యమా స్పీడుగా సినిమాలు తెరకెక్కిస్తాడని తెలుసు గాని.. మరీ ఇంత స్పీడా అంటూ అందరూ ఆశ్చర్యపోతున్నారు. తాజాగా 'పైసా వసూల్' స్టంపర్ ని విడుదల చేసింది చిత్ర యూనిట్. ఆ స్టంపర్ లో బాలయ్య ఎనర్జీ, స్పీడు, స్టైల్ అందరిని బాగా ఆకట్టుకుంది.
అయితే 'పైసా వసూల్' స్టంపర్ సినిమాపై అంచనాలను పెంచినప్పటికీ.... ఈ సినిమా సెప్టెంబర్ 1 నే విడుదల చేస్తామని చెప్పిన చిత్ర నిర్మాతలకు ఇప్పుడు కొద్దిగా షాక్ తగిలేలా ఉందంటూ ప్రచారం మొదలైంది. కారణమేమిటంటే 'పైసా వసూల్' బిజినెస్ ఆశించిన రేంజ్ లో లేదన్నది ట్రేడ్ వర్గాల టాక్. పూరి, బాలయ్యలది క్రేజీ కాంబినేషన్ అయినా... రిలీజ్ డేట్ ముందుకు జరగడం ఒక కారణమైతే......'గౌతమీపుత్ర శాతకర్ణి' మార్కెట్ తో ఈ మూవీని కొనలేమని బయ్యర్స్ అనడం మరో కారణం గా తెలుస్తుంది. అలాగే ఈ మధ్య పూరి పై వచ్చిన ఆరోపణలు కూడా మరో కారణంగా తెలుస్తుంది. ఏది ఏమైతేనేం ఇప్పటివరకు నైజాం, సీడెడ్, ఓవర్సేస్ బిజినెస్ లు జరిగినప్పటికీ... ఆంధ్రలో మాత్రం జిల్లాలవారీ నిర్మాత కొటేషన్ కు బయ్యర్స్ ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది.
అయితే 'పైసా వసూల్' 45 కోట్ల పైగా టోటల్ బిజినెస్ చేస్తే నిర్మాత టేబుల్ ప్రాఫిట్ లో ఉంటాడని అంటున్నారు. కాకపోతే 'పైసా వసూల్' శాటిలైట్, ఆడియో హక్కులు 10 కోట్లు కలపుకుని ఇప్పటికి సుమారు 20 కోట్ల బిజినెస్ చేశారని.. మరో 15 కోట్లు ఆంధ్రలో ఈజీ అంటున్నారు. అయితే అసలు లెక్కలు తేలాలంటే ఈనెల 17న జరిగే ఆడియో రిలీజ్ తర్వాత వరకు ఆగాల్సిందే అంటున్నారు. ఇక ఈ చిత్రంలో బాలయ్య సరసన శ్రియ శరణ్, ముస్కాన్, కైరా దత్ లు నటిస్తున్నారు.