టాలీవుడ్ ఇండస్ట్రీని డ్రగ్స్ ఉదంతం ఒక ఊపు ఊపి వదిలిపెట్టిన విషయం తెలిసిందే. మొన్నటి వరకు సిట్ అధికారులు సెలబ్రిటీస్ కి నోటీసులు ఇవ్వడం వాళ్ళని గంటల తరబడి విచారించడం వంటి పెద్ద హై డ్రామాగా జరిగినప్పుడే దర్శకుడు రామ్ గోపాల్ వర్మ సెలబ్రిటీస్ ని ఇలా రోడ్డుకీడ్చడం పద్దతి కాదంటూ లెక్చరిచ్చిన విషయం తెలిసిందే. వారు తప్పు చేశారు అని తెలిస్తేనే వారిని ఇలా విచారించాలని... అంతేకాని పబ్లిసిటీ కోసం కొంత మందిని ఇలా బయటికి లాగడం బాగోలేదని కూడా మీడియా ముఖంగా చెప్పిన వర్మ ఇప్పుడు తాజాగా తెలుగు ఫిల్మ్‌చాంబర్‌కి ఆయన బహిరంగ లేఖ రాశారు.
అసలు సినీ పరిశ్రమ సిగ్గుపడాల్సింది డ్రగ్స్ స్కాండల్ విషయంలో కాదని.. డ్రగ్స్ స్కాండల్‌పై సినీ ఇండస్ట్రీ తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కు క్షమాపణ లేఖ రాసినందుకు సిగ్గుపడాలన్నారు. అసలు నోటీసులు అందుకున్న ఏ ఒక్కరూ తప్పు చేశామని బహిరంగంగా చెప్పలేదు.. వారి తప్పు ఇంకా నిరూపించబడలేదు.. అవన్నీ జరగకుండా ఇలా ఎందుకు క్షమాపణ చెప్పినట్టు? ఎవరు కొద్దిమంది ఇండస్ట్రీలో తప్పు చేశారని... ఫిల్మ్‌చాంబర్‌కి అసలెవరు చెప్పారు? సిట్ అధికారులు సెలబ్రిటీస్ ని ప్రశ్నించిన తీరుపై ఆగ్రహించాల్సింది పోయి ఫిలిం ఛాంబర్ ఏదో నేరం రుజువైనట్టు క్షమాపణ లేఖ పంపడమేంటి? అని వర్మ ఫిల్మ్ ఛాంబర్ మీద ఘాటుగా కాదు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాడు.
అలాగే డ్రగ్స్ కేసులో నోటీసులు అందుకుని విచారణకు హాజరైన ప్రతి ఒక్కరు బహిరంగ లేఖ రాయాలన్నారు రామ్ గోపాల్ వర్మ. ఇక నిజం మాట్లాడే హక్కు ప్రతి పౌరుడికీ ఉందని.... అలాగే నోటీసులందుకున్న వారి తప్పు అస్సలు లేదని తేలితే.. డ్రగ్స్ కేసులో ఆరోపణలు ఎదుర్కొన్న అందరికీ ఫిల్మ్ చాంబర్ క్షమాపణ చెప్పాలని వర్మ డిమాండ్ చేశారు. ఒకవేళ నోటీసులు అందుకుని విచారణకు హాజరైనవారు గనక ఎటువంటి స్పందనా తెలియజేయకుండా ఉంటే గనక ఆరోపణలు ఎదుర్కొన్న వారంతా నేరస్తులేనని.. ఫిల్మ్‌చాంబర్ క్షమాపణల వల్లే వదిలేశారనే అబద్ధం నిజంగా నిలిచిపోతుందన్నారు. ఆ అబద్ధం నిజం కాకుండా చూడాల్సిన బాధ్యత ఫిల్మ్‌చాంబర్‌కు ఉందని రామ్ గోపాల్ వర్మ తాను రాసిన బహిరంగ లేఖలో పేర్కొన్నారు.