తెలుగు బిగ్‌బాస్ షోపై తొలుతగా అధికారికంగా ఫిర్యాదు మొదలైంది. ఈ షోలో మానవ హక్కుల ఉల్లంఘన జరుగుతోందని హెచ్ ఆర్ సిలో కేసు నమోదైంది. మానవ హక్కుల సంఘంలో కేసు నమోదు కావడంతో కార్యక్రమ నిర్వాహకులు కాస్త ఆందోళన చెందుతున్నారు. తమ లాయర్లతో సంప్రదింపులు జరుపుతున్నారు. బిగ్‌బాస్ హౌస్‌లో పార్టిసిపెంట్స్‌కి కఠిన శిక్షలు అమలు చేస్తున్నారు. అవి వారి ప్రాణాలకు ముప్పు వాటిల్లే విధంగా ఉంటున్నాయని ఫిర్యాదులో పేర్కొన్నారు.
విచారణ జరపకుండా కోర్టులు, పోలీసులకు కూడా ఎవ్వరినీ శిక్షించే అధికారం లేదని, కానీ ఈ షోలో అడ్డదిడ్డంగా తమకు తోచిన శిక్షలను వేస్తున్నారని బాలల హక్కుల పరిరక్షణ కార్యకర్త అచ్యుత్‌రావు ఈ కేసును వేశారు. ఇటీవల ఇంటి యజమానిగా ఫెయిలైన పార్టిసిపెంట్ ప్రిన్స్‌కి 50 సార్లు స్మిమ్మింగ్‌పూల్‌లో మునకలు వేసే శిక్ష విధించారని, ఇలాంటివి చూడటానికి చిన్నవిగానే కనిపించినా, ఆట పేరుతో ఇలాంటి ప్రమాదకరమైన శిక్షలు వేయడాన్ని ఆయన తప్పుపట్టారు.
తెలుగులో మాట్లాడనందుకు ముమైత్ ఖాన్ నోటికి ప్లాస్టర్ అంటించడం, తిండి నుంచి శ్వాస పీల్చుకోవడం వరకు ఇస్తున్న పనిష్‌మెంట్స్ మానవ హక్కుల ఉల్లంఘన కిందకే వస్తాయని ఆయన తెలిపాడు. ప్రతిరోజు ఎందరో పిల్లలు ఈ షో చూస్తున్నారని దాంతో వారి ప్రవర్తన, నడవడిక, ఆలోచనా విధానంలో కూడా పలు మార్పులు వచ్చే అవకాశం ఉందని ఆయన ఆందోళన వ్యక్తం చేశాడు. మరి ప్రేక్షకులను బాగానే ఆలరిస్తున్న ఈషోపై హెచ్‌ఆర్‌సీ ఎలాంటి తీర్పు ఇవ్వనుందో వేచిచూడాల్సివుంది...!