నిజానికి పవన్ కళ్యాణ్ అందరిలాంటి మనస్తత్వం కలిగిన వాడు కాదు.. ఆయనో ఎమోషనల్ పర్సన్, అంతర్ముఖుడు. సాధారణంగా బయటపడడు గానీ ఏదైనా ఇబ్బంది కలిగిస్తే మాత్రం బరస్ట్ అవుతాడు. ఆయన చేసే ప్రసంగాలు, ట్వీట్స్, ఆయన లేవనెత్తే ప్రశ్నలు, రాజకీయ సమస్యల నుంచి తన పొలిటికల్ అండ్ సినిమా జర్నీ దాకా, ఇటీవల డ్రగ్స్ విషయంలో తెలంగాణ సీఎం కేసీఆర్‌కి రాసిన లేఖ కూడా అదే కోవలోకి వస్తుంది.
ఇక ఆయన తాజాగా తాను చేస్తున్న చిత్రం అక్టోబర్‌కి పూర్తవుతుందని, ఆ తర్వాత వారానికి మూడు రోజులు రాజకీయలు, ప్రజాసమస్యలు, పార్టీని సంస్థాగతంగా పటిష్టం చేయడంపైనే దృష్టిపెడతానని, తనకు ఖాళీ ఉన్నప్పుడు సినిమాలు చేస్తానని,కావాలంటే వాటిని పూర్తిగా వద్దనుకుంటానని కూడా చెప్పాడు. దీంతో వచ్చే ఎన్నికల తర్వాత పరిస్థితి ఏమోగానీ పెరిగిన రాజకీయ వేడి ప్రకారం ఆయన ఎన్నికలలోపు చేసే చిట్టచివరి చిత్రం త్రివిక్రమ్‌శ్రీనివాస్ దర్శకత్వంలో రాధాకృష్ణ నిర్మాతగా, హారిక అండ్ హాసిని బేనర్‌పై చేసే చిత్రమేనని అర్ధమవుతోంది.
మరోపక్క ఇది కాస్త పవన్‌కి పొలిటికల్ మైలేజ్ ఇస్తూనే ఆయన చేస్తున్న ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ అనే తెలుస్తోంది. ఇక ఇందులో ఆయన ఓ సాఫ్ట్ వేర్ ఉద్యోగిగా చేస్తున్నాడని, ఆయన ఆఫీసు, ఉండే ఇళ్లను రామోజీఫిల్మ్ సిటీలో సెట్స్ వేశారంటున్నారు. ఇక ఆ తర్వాత పాటలకు ఓ విదేశాలకో, సెట్స్‌కో తప్ప ఇతర పెద్ద హంగామాలేమీ ఉండవు. ఓ సైన్స్‌ఫిక్షనో, లేక పీరియాడికల్ మూవీనో కాదు. ఫక్తు త్రివిక్రమ్ స్టైల్‌లో సాగే చిత్రమే ఇది.
కానీ దీని బడ్జెట్ ఏకంగా 100కోట్లు అని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. రెండు భాషల్లో, అందునా మురుగదాస్, విదేశాలలో చేజింగ్ సీన్లు, ఏడాదికి పైగా షూటింగ్ జరుపుకుంటున్న మహేష్ చిత్రం కూడా అంతే బడ్జెట్. మరి పవన్ చిత్రంలో కీర్తిసురేష్, అనుఇమ్మేన్యుయేల్ వంటి మామూలు తారాగణమే ఉంది. మరి దీనికి 100కోట్లు నిజమేనా? అనే అనుమానం వస్తుంది. అయినా ఈ 100కోట్ల బడ్జెట్ టాక్‌తో పాటు పవన్‌కి దాదాపుగా చివరి సినిమా అనే పాయింట్‌ను తీసుకుంటే ఈ చిత్రం బడ్జెట్ ఎంతో తెలియదు గానీ కలెక్షన్లు మాత్రం ముందు చిత్రాల కంటే భారీగా ఉండనుండటం ఖాయంగా కనిపిస్తోంది.