మా ఛానల్ లో గత 20 రోజులుగా ప్రసారమవుతున్న బిగ్ బాస్ షోని వీకెండ్స్ లో ఎన్టీఆర్ బాగా రక్తికట్టిస్తున్నాడు. శనాదివారాల్లో ఎన్టీఆర్ హోస్ట్ గా అదరగొడుతున్నాడు. ఎన్టీఆర్ హోస్ట్ చేస్తున్న ఈ షో కేవలం ఆ రెండు రోజులు మాత్రమే క్రేజ్ ఉంటుందని మొదట్లో భావించినప్పటికీ.... ఇప్పుడు బిగ్ హౌస్ పార్టిసిపేట్స్ అంతా తమ తమ సొంత అభిప్రాయాలతో ముందుకు సాగుతూ షోని రక్తి కట్టిస్తున్నారు. అయితే శనాదివారాల్లో ఎన్టీఆర్ చేసే హోస్టింగ్ కి మాత్రం ప్రేక్షకులు ఇప్పటికి నీరాజనాలు పడుతున్నారు. ఎన్టీఆర్ కూడా తనదైన శైలిలో ప్రేక్షకులని కాకుండా షోలో పార్టిసిపేట్స్ కి కూడా హుషారు తెప్పించడానికి తనవంతు ప్రయత్నం చేస్తున్నాడు.
దీనిలో భాగంగానే గతరాత్రి జరిగిన షోలో ఎన్టీఆర్ ఒక ఉంగరం కథ చెప్పాడు. ఇంతకీ ఆ ఉంగరం కథ ఎందుకు చెప్పాల్సి వచ్చింది అంటే.... ధనరాజ్ తన కొడుకు గురించి మాట్లాడినపుడు, ఎమోషన్ అయినపుడు ఎన్టీఆర్ కూడా తన భార్య, కొడుకు గురించి చెబుతూ ఈ ఉంగరం కథ చెప్పుకొచ్చాడు. తన చేతికున్న ఉంగరాన్ని చూపిస్తూ ఈ ఉంగరాన్ని తన భార్య లక్ష్మి ప్రణతి ఇచ్చిందని....చెప్పుకొచ్చాడు. అయితే భార్య ఉంగరం ఇస్తే దానిలో స్పెషల్ ఏముంటుంది అనుకుంటున్నారా? అక్కడే ఉంది అసలు కథ.
ఆ ఉంగరంలో ఒకవైపు ప్రణతి పేరు.... మరో వైపు కొడుకు అభయ్ రామ్ పేరు ఉన్నాయట. ఆ ఉంగరం చూసిన ఎన్టీఆర్ అదేమిటి మీ ఇద్దరి పేర్లు మాత్రమే ఈ ఉంగరంలో ఉన్నాయి....ఇందులో నా పేరు లేదేమిటి అని ప్రణతిని ప్రశ్నించగా.... దానికి ప్రణతి రెండు పేర్ల మధ్య వున్న చిన్న వజ్రమే ఎన్టీఆర్ అని సమాధానం చెప్పిందట. మరి భార్యగా ప్రణతి ప్రేమ ఎన్టీఆర్ మీద ఎలా ఉందొ చూశారూ. ఇక ఎన్టీఆర్ మాత్రం సందర్భం వచ్చినప్పుడల్లా.. తన కొడుకు అభయ్ అల్లరిని అభిమానులకే కాకుండా తెలుగు ప్రేక్షకులందరికీ చేరవేస్తూనే ఉన్నాడు.