సినీ ఫీల్డ్‌లో మిగిలిన ఫ్యామిలీల కంటే మంచు మోహన్‌బాబు తర్వాత ఆయన వారసులైన మంచు విష్ణు, మంచు మనోజ్, లక్ష్మీలు సరిగా క్లిక్ కాలేదు. వీరిలో కాస్త మంచు విష్ణు మాత్రమే ఫర్వాలేదనిపిస్తున్నాడు. అయినా నటనతో పాటు డైలాగ్ డెలివరీ, విభిన్న చిత్రాలు ఎంచుకోవడంలో మాత్రం మంచు మనోజే బెటర్. ఆయనకు తగ్గ హిట్ పడలేదనే కానీ ఆయన అభిరుచి బాగానే ఉంటుంది. ఇక ఆయన తాజాగా 'ఒక్కడు మిగిలాడు' చిత్రంలో నటిస్తున్నాడు. తమిళ రీమేక్‌గా తెరకెక్కుతున్న ఈ చిత్రం ద్వారా అజయ్ అండ్రూస్ తెలుగు తెరకు దర్శకునిగా పరిచయమవుతున్నాడు. ఇక ఇందులో మనోజ్ తమిళ ఈలం నాయకుడైన ప్రభాకరన్ తరహా పాత్రతో పాటు స్టూడెంట్ లీడర్‌గా కూడా కనిపించనున్నాడు.
మరి ఈలం నాయకుడికి, విద్యార్ది నాయకునికి ఉన్న సంబంధం ఏమిటనేది ఆసక్తిని రేపుతోంది. ఇక ఈ చిత్రానికి సంబంధించి విడుదలైన స్టిల్స్‌లో కూడా మంచు మనోజ్ లుక్, గెటప్, స్టైల్..కథ, కథనం.. ఇలా అన్ని వైవిధ్యంగా ఉంటాయని తెలుస్తోంది. ఇక తాజాగా శ్రీలంక శరణార్దులు 10 మంది సముద్రంలో చిక్కుకునిపోయి పడే బాధలను చిత్రీకరించారు. షూటింగ్ దాదాపు పూర్తయింది. వలస బాధితులు సముద్రం మద్యలో పడవలో ఎన్నెన్ని కష్టాలు పడ్డారో చిత్రీకరణ జరిపామని దర్శకుడు అజయ్ అండ్రూస్ చెబుతున్నాడు. ఇక సాధారణంగా తమిళ యంగ్ టాలెంట్ ఈమద్య బాగా వైవిధ్యమైన చిత్రాలను తీసి ఆకట్టుకుంటున్నారు. ఇక అండ్రూస్ కూడా తమిళుడే కాబట్టి ఆయనకు ఎల్టీటీటీఈ మీద మంచి అవగాహనే ఉండి ఉంటుందని భావిస్తున్నారు.
మనోజ్ తాజాగా తీసిన సీక్వెన్స్‌లు తన మీద కాదని, ఈ సీన్స్ సినిమాలో 40 నిమిషాల పాటు ఉండి ఆసక్తిని కలిగిస్తాయంటున్నాడు. ఈ సినిమా షూటింగ్‌ని ఎంతో వైవిధ్యంగా కష్టపడి తీసిన యూనిట్‌కి నా అభినందనలు అంటున్నాడు. ఇక తెలుగులో శరణార్దులు, సముద్రంలో తీసిన చిత్రాలు చాలా తక్కువ. ప్రభాస్ హీరోగా రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన 'ఛత్రపతి'లో ఇవి నామమాత్రంగానే కనిపించాయి. ఇప్పుడు 'ఒక్కడు మిగిలాడు'తో ఈ కోరిక తీరనుంది.