చారిత్రక నేపధ్యం వంటి కథతో, అద్భుతమైన సాంకేతిక విలువలతో వచ్చిన 'బాహుబలి', తక్కువ బడ్జెట్‌లో లో బడ్జెట్‌గా వచ్చిన 'పెళ్ళి చూపులు'.. ఈ రెండు చిత్రాలు విమర్శకుల ప్రశంసలతో పాటు కమర్షియల్‌గా పెద్ద విజయాలను నమోదు చేశాయి. ఇప్పటికే ఈ రెండు చిత్రాలకు అవార్డులు, రివార్డులు వచ్చాయి. ఇక ఈ రెండు చిత్రాలు మరో ఘనతను సాదించనున్నాయి. ఇండియన్ ఫిల్మ్‌ఫెస్టివల్ ఆఫ్ మెల్‌బోర్న్ 2017లో ఈ రెండు చిత్రాలను ప్రదర్శించనున్నారు.
తెలుగు నుంచి ఎంపికైన చిత్రాలు ఈ రెండే. ఇక ఇతర భాషల నుంచి కూడా విమర్శకుల ప్రశంసలు, కలెక్షన్లు కొల్లగొట్టిన చిత్రాలను ఎంపిక చేశారు. ఇక రాజమౌళి తీసిన 'బాహుబలి'కి, తరుణ్ భాస్కర్ తీసిన 'పెళ్ళి చూపులు'కి ఈ ఘనత లభించడం పట్ల అందరూ ఈ నిర్ణయంతో ఏకీభవిస్తూ ఏకాభిప్రాయం తెలుపుతుండటం విశేషం. ఇలాంటి చిత్రాల ఎంపికలో ఎప్పుడు వచ్చే విమర్శలు, ఇతర చిత్రాలకు అన్యాయం జరిగిందనే వ్యాఖ్యలు ఈసారి రాలేదు.
ఇక ఆగష్టు రెండో వారంలో జరగనున్న ఈ వేడుకకు 'బాహుబలి' హిందీ వెర్షన్ నిర్మాత, ప్రముఖ బాలీవుడ్ దర్శక నిర్మాత, ధర్మ ప్రొడక్షన్స్ అధినేత కరణ్ జోహార్, ఐశ్వర్యా బచ్చన్, కొంకణ్‌సేన్ శర్మలు హాజరుకానున్నారు. ఈ ఫిలిం ఫెస్టివల్ కోసం అప్పుడే ఏర్పాట్లు చేస్తున్నారు. రిలీజ్ అయి విమర్శకుల ప్రశంసలు, కమర్షియల్ విజయాలను సాధించిన ఈ చిత్రాలను ఇంతకాలమైనా అందరూ ఇంకా గుర్తుపెట్టుకుని ప్రశంసలు కురిపిస్తూ ఉండటం విశేషంగా చెప్పవచ్చు.