క్రియేటివ్ దర్శకుడు కృష్ణవంశీ స్కూల్ ప్రత్యేకమైనది. తాను తీసే చిత్రాలలో నటులు కనిపించకుండా పాత్రలే కనిపించాలని ఆయన ఎంతో కష్టపడుతుంటాడు. దాంతో తన చిత్రంలో నటించే ఆర్టిస్టుల చేత కూడా కఠోరసాధన చేయిస్తాడు. తాను అనుకున్న అవుట్‌పుట్ వచ్చేదాకా వదిలే రకం కాదు ఆయన. అందుకే ఆయన ఎందరో నటీనటులకు సింహస్పప్నం. ఆయన టార్చర్ భరించలేమని చెప్పి, ఆయనపై అవాక్కులు చెవాక్కులు పేలే వారు... కృష్ణవంశీ సరిగా తీయడని, సమయానికి అవుట్‌పుట్ సాదించి, అనుకున్న బడ్జెట్‌లో, అనుకున్న సమయంలో షూటింగ్ పూర్తిచేయడని బయటికి వచ్చిన తర్వాత ఆయన గురించి చెడుగా ప్రచారం చేసే వారికి కూడా కొదువలేదు.
ఈ విషయంలో కాస్త వాస్తవం ఉన్నా కూడా కృష్ణవంశీ క్రియేటివిటీని, ఆయన పంథాను తప్పు పట్టడం మాత్రం సమంజసం కాదు. ఇక ఏకంగా సాయి ధరమ్‌తేజ్... కృష్ణవంశీ దర్శకత్వంలో ఓ రోల్ చేస్తున్నానని చెప్పినప్పుడు చిరంజీవి, పవన్ కళ్యాన్‌లు ఆల్ ది బెస్ట్.. ఆయనతో పనిచేస్తే ఎన్నో విషయాలు నేర్చుకుంటావు. ఆయన అందరికీ ఓ పెద్ద బాలశిక్ష అని చెప్పారని స్వయంగా సాయి ధరమ్ తేజ్ ఆమద్య చెప్పుకొచ్చాడు. ఇక పోలీస్ కావాలని ఆశపడే ఓ యువకుడి కథే 'నక్షత్రం'. ఇందులో సందీప్‌కిషన్ హీరోగా నటిస్తున్నాడు. ఇక అసలే కాస్త నలుపుగా ఉండే సందీప్‌ని పోలీసు పాత్ర కాబట్టి ఎండల్లో తిరిగే ఉద్యోగమని, కాబట్టి పాత్ర ప్రకారం మరింత నల్లగా మారాలని కృష్ణవంశీ సందీప్ కిషన్‌కి చెప్పాడట.
దాంతో దాదాపు షూటింగ్ జరిగిన ఒకటిన్నర ఏడాది, మరీ ముఖ్యంగా షూటింగ్ జరిగిన 120 రోజులు సందీప్ కిషన్ మరింత నల్లబడేందుకు రెండుగంటలు ఎండలో నిల్చోవడం, ఎండల్లో రన్నింగ్, వాకింగ్ వంటివి చేసి కష్టపడ్డాడట. మరి సందీప్, కృష్ణవంశీల కష్టానికి ఎలాంటి ఫలితం దక్కనుందో మరో రెండు మూడు రోజుల్లో తేలిపోతుంది.