'ప్రేమమ్' చిత్రం తర్వాత ఆ చిత్రం భాష అర్ధంకాకపోయినా కూడా సాయిపల్లవి నటనకు, డ్యాన్స్‌కి దేశవ్యాప్తంగా సినీ ప్రేమికులు 'ఫిదా' అయిపోయారు. ఆ సమయంలో ఆమె జార్జియాలో చదువుతుండటంతో ఆమె కేవలం తన హాలీడేస్‌లోనే ఈ చిత్రం షూటింగ్ పాల్గొంటానని కండీషన్ పెట్టినా దర్శకనిర్మాతలు ఓకే చెప్పారు. అందమైన మోము, దానిపై కాస్త పుట్టుమచ్చలు, మన పక్కింటి అమ్మాయిలా ఉండే ఆమె 'ప్రేమమ్'లో చేసిన మల్లార్ పాత్రకు జీవంపోసింది. అప్పుడే శేఖర్‌కమ్ముల ఆమెను తన 'లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్'లో నటించమని కోరినా కూడా తన చదువుకి ఆటంకం అని చెప్పి నో చెప్పింది.
ఇక హీరోయిన్లను అందంగా చూపించడంలో మాస్టర్స్ అయిన మణిరత్నం, గౌతమ్‌మీనన్‌లకు కూడా కేవలం ఈ చిత్రంలో కాస్త గ్లామర్ చూపించాల్సి రావడంతో నో చెప్పింది. దాంతో ఆమెకి పొగరు అనే ప్రచారం జరిగింది. ఇక ఆమె చదువు పూర్తయిందని తెలుసుకున్న శేఖర్‌కమ్ముల, దిల్‌రాజు 'ఫిదా'లో అడిగితే ఓకే చెప్పింది, మణిరత్నం, గౌతమ్‌మీనన్‌లకు నో చెప్పిన ఆమె 'ఫిదా'కి ఒప్పుకోవడంతో చాలా మంది ఆశ్యర్యపోయారు. ఇక నేడు 'ఫిదా' అంటే సాయిపల్లవి.. సాయిపల్లవి అంటే 'ఫిదా' అన్నట్లుగా మారిపోయింది. తెలంగాణలో పుట్టిపెరిగిన వారు కూడా మాట్లాడలేనంత చక్కగా తన భన్సువాడ భానుమతి పాత్రకు జీవం పోసింది. ఇప్పుడు ఎవరి నోట విన్నా, ఏ ఇద్దరు చర్చించుకున్నా అది సాయిపల్లవి గురించే అవుతోంది. అంతగా ఈ చిత్రం ఆమెకు పేరు ప్రతిష్టలు తెచ్చింది.
ఇక ఈచిత్రం కోసం ఆమె 30లక్షలు తీసుకుందిట. కానీ ఈ చిత్రం తర్వాత ఆమె ముందే ఒప్పుకున్న నాగశౌర్య చిత్రం, దిల్‌రాజు-నాని- వేణుశ్రీరాంల 'ఎంసీఏ'కి అంతే మొత్తం ఒప్పుకుంది. కానీ కొత్తగా వచ్చే చిత్రాలకు మాత్రం 70లక్షల వరకు డిమాండ్ చేస్తోందని సమాచారం. మరో ఒకటి రెండు హిట్స్ వస్తే ఏకంగా కోటికి ఎదుగుతుంది. ఆమెకు ఉన్న క్రేజ్ దృష్ట్యా అంత మొత్తం ఇవ్వడానికి నిర్మాతలు ఓకే చెబుతున్నారు. 'ఎంసీఏ'కే కాదు.. నాగశౌర్య చిత్రానికైతే హీరోకన్నా ఆమె పైనే ఎక్కువ అంచనాలున్నాయి. అయినా రెమ్యూనరేషన్ గొడవలో పడి సినిమాలలో తన పాత్ర కంటెంట్‌ని మాత్రం చూడకుండా ఒప్పుకోవద్దని ఆమెకు కొందరు సూచిస్తున్నారు. వరుణ్‌తేజ్ ఆ మధ్య.. 'సాయిపల్లవి' వస్తోంది...మీ పాత్రలు ఎగరేసుకుపోతుంది.. పారా హుషార్ అని మిగిలిన హీరోయిన్లకి ఇచ్చిన వార్నింగ్ ఇప్పుడు నిజరూపం దాలుస్తోంది.