ఓ నటుడు మూగ, చెవిటి వాడైనప్పటికీ పాత్రను అర్దం చేసుకోవడం, డైలాగ్స్‌లో లిప్ సింక్ చేయడం అంటే మామూలు విషయం కాదు. కానీ అలాంటి అసాధ్యాని సాధ్యం చేసిన కన్నడ యువ హీరో ధృవ్ శర్మ. ఆయన నటించిన తొలి కన్నడ చిత్రం పెద్ద హిట్ అయింది. ఆ చిత్రం తెలుగులో 'స్నేహాంజలి'గా డబ్ అయింది. ఈ చిత్రానికి కన్నడలోనే కాదు.. తెలుగులో కూడా పలు ప్రశంసలు లభించాయి.
ఆ తర్వాత కూడా ఆయన అనేక హిట్ చిత్రాలలో నటించాడు. కాగా ఆయన ఈ రోజు ఆకస్మికంగా గుండె పోటు వచ్చి మరణించాడు. దాంతో కన్నడ పరిశ్రమ ఒక్కసారిగా షాక్‌కి గురైంది. ఆయన మరణానికి పలు అవయవాలు పనిచేయకపోవడమే కారణమని వైద్యులు తేల్చారు. అయితే ఇప్పటి వరకు ఆయన ఎలాంటి శారీరక రుగ్మతలతో బాధపడిన దాఖలాలు లేవని ఆయన సన్నిహితులు చెబుతున్నారు. సెలబ్రిటీ క్రికెట్ లీగ్ ద్వారా కూడా ఆయన టాలీవుడ్ నటులకు, ప్రేక్షకులకు పరిచయం. ఆయన కర్ణాటక బుల్‌డోజర్స్ జట్టుకు ప్రాతినిధ్యం వహించాడు. పుట్టుకతోనే మూగ, చెవిటి అయిన ఆయనను ఎవ్వరూ అలా భావించరు. అంతగా ఆయన చలాకీగా ఉంటాడు.
వాస్తవానికి ఆయనను శనివారం హాస్పిటల్‌లో జాయిన్ చేస్తే ఆయన ఈ రోజు మరణించాడు. ఆయన మృతిపట్ల ప్రియమణి, రితేష్‌దేశ్‌ముఖ్, ఆప్తాబ్ శివదాని తీవ్ర దిగ్బ్రాంతిని వ్యక్తం చేశారు. ఆయన మరణిస్తే తమ సొంత సోదరుడు మరణించినంతగా, గుండె పగిలేలా ఉందని వారు తమ సంతాప సందేశాలలో పేర్కొన్ని ఆయన ఆత్మకు శాంతి కలగాలని ఆ దేవుడిని ప్రార్ధించారు. మొత్తానికి ఓ మంచినటుడిని మాత్రం సినీ పరిశ్రమ ఆకస్మికంగా కోల్పోయిందని మాత్రం చెప్పవచ్చు.