తాను చేసినవి కొన్ని చిత్రాలే అయినా వాటిల్లో 'గులాబి, సిందూరం, నిన్నేపెళ్లాడతా, మురారి, ఖడ్గం, అంత:పురం, సముద్రం, రాఖి, మహాత్మా, చందమామ' వంటి గుర్తిండిపోయే చిత్రాలను తీసి క్రియేటివ్ డైరెక్టర్‌గా పేరుపొందిన దర్శకుడు కృష్ణవంశీ. కానీ ఆయన ఈమద్య ఫామ్‌లో లేకపోవచ్చు. కానీ ఆయన చిత్రాలను చూసిన వారెవ్వరూ ఆయన క్రియేటివిటీని మాత్రం శంకించలేరు. ప్రతి సినిమా ద్వారా సమాజానికి ఏదో చెప్పాలి? ఏదో సందేశం ఇవ్వాలి.. అనే తపన ఆయనలో నరనరాన జీర్ణించుకుని పోయి ఉంది.
ఇక తాజాగా ఆయన తనదైన పోలీస్ స్టోరీతో తీసిన చిత్రం 'నక్షత్రం' ఈ శుక్రవారం థియేటర్లలోకి రానుంది. ఇక ఈ సందర్భంగా ఆయన ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, ఇప్పటికీ దర్శకత్వంలో నేను విద్యార్ధినే. ఇంకా రాంగోపాల్ వర్మగారికి అసిస్టెంట్‌గానే భావిస్తాను. నేను కూడా మణిరత్నం గారిలా చిత్రం తీయగలిగినప్పుడు. బాపు గారిలో ఓ పాట తీయగలిగినప్పుడు మాత్రమే నేను దర్శకునిగా భావిస్తాను. ఆ రోజున ఇక సినిమాలు వదిలేసి నా ఊరెళ్లి వ్యవసాయం చేసుకుంటాను.
అని ఆయన చెప్పిన మాటలు, ఒకే ఒక్కచిత్రం విజయంతోనే తమను మించిన డైరెక్టర్లు, క్రియేటర్లు లేరని ఫీలయ్యే ఎంతో మంది కొత్తతరం దర్శకులకు ఆయన పెద్ద బాలశిక్ష వంటివాడు. ఇక తన గురువు వర్మ వల్లనైనా ఆయన బాలకృష్ణతో తీయాలనుకుంటున్న 'రైతు' చిత్రంలో నటించడానికి అమితాబ్ ఒప్పుకునే రోజు వస్తుందని ఆశిద్దాం...!